ర్యాగింగ్‌ను నిరోధిద్దామిలా | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ను నిరోధిద్దామిలా

Published Tue, Aug 26 2014 10:37 PM

Raging resist like this

 నాగపూర్ :  రోజురోజుకూ మహిళలు, విద్యార్థినులపై దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. కళాశాలల్లో ర్యాగింగ్‌భూతం వెంటాడుతోంది. యువత పెడతోవన పడుతోంది. సభ్యసమాజం తలదించుకొనేలా వికృత చేష్టలతో మహిళలను కించపర్చే పాశ్చాత్య సంస్కృతిని ఒంటబట్టించుకున్న కొందరు యువకులు చదువులమ్మ ఒడిని భ్రష్టుపట్టిస్తున్నారు. విషసంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

 ఈ సంస్కృతికి బీజం స్కూలు, కాలేజీల్లోనే పడుతోంది. చదువుకోవడానికి కొత్తగా వచ్చే వారిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడం మామూలైంది. అమానుషమైన ర్యాగింగ్ రక్కసిని తరిమి వేయడానికి జిల్లా న్యాయ సేవా అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) నడుం బిగించింది. యువతను గాడిలో పెట్టేందుకు ర్యాగింగ్ నిరోధించడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. కళాశాలలను వేదికగా చేసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగరంలోని వైద్యకళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలో విజయవంతంగా పూర్తి చేసింది.

అదేవిధంగా ఎన్‌కేపీ సాల్వ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రిసెర్సీ సెంటర్‌లోని సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులకు, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని సీనియర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలపై డీఎల్‌ఎస్‌ఏ అవగాహన కల్పించింది. జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ర్యాగింగ్‌లాంటి వికృత చేష్టలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని ర్యాగింగ్ నిర్మూలన రూపకర్త డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ కిషోర్ జైస్వాల్  అన్నారు. జూనియర్ విద్యార్థులు ‘సర్’ లేదా మేడమ్ అని పిలువాలని సూచించడం కూడా నేరమేనని చెప్పారు.

 పకడ్బందీ చర్యలు
 సెషన్స్‌కోర్టు సివిల్ జడ్జి జైస్వాల్ మాట్లాడుతూ ‘2009లో  కాంగ్రా(హెచ్‌పీ)లోని రాజేంద్రప్రసాద్ మెడికల్ కాలేజీలో అమన్ అనే మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలైందని, ఈ చర్యతో దేశం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు.
 అప్పటి నుంచి ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధానికి పక్బడందీ చర్యలు చేపట్టి అమలు చేస్తోందని వివరించారు. ర్యాగింగ్ విషసంస్కృతిని అరికట్టేందుకు తప్పుచేసిన వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా విచారణకు అర్హులేనని పేర్కొన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

 నేరపూరితమైన చర్యను ఉపేక్షించొద్దు
 మాజీ ప్రభుత్వ ప్లీడర్, న్యాయవాది, డీఎల్‌ఎస్‌ఏ టీం మెంబర్  సత్యనాథన్ మహరాష్ట్ర ర్యాగింగ్ నిరోధక చట్టం-1999 గురించి వివరించారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ర్యాగింగ్ పాల్పడడం నేరపూరితమైన చర్య అని, రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 10,000 విధించే అధికారం చట్టం కల్పించిందని పేర్కొన్నారు.

 కళాశాలలు, పాఠశాలలకు వచ్చే కొత్త విద్యార్థులను ర్యాగింగ్ ద్వారా సీనియర్ విద్యార్థులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది సరైన చర్య కాదని అన్నారు. మెడికల్ కాలేజీల్లోనే ర్యాగింగ్ తీవ్రంగా ఉంటుందన్నారు. సీనియర్ల చేతిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులు ఫిర్యాదు చేయాలని, ఈ మేరకు నేరం చేసినవారిపై కఠిచర్యలు తీసుకొనే అవకాశం చట్టం కల్పించిందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో సెప్టెంబర్‌లో చట్టంపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు.

 జాతీయ హెల్ప్‌లైన్ : విద్యార్థుల మనోభావాల, ఆత్మగౌరవాన్ని ర్యాగింగ్ తీవ్ర విఘాతం కల్గిస్తోందని, దీన్ని నిరోధించడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌ను కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.

Advertisement
Advertisement