కరవు కాలంలో సంబరాలా? | Sakshi
Sakshi News home page

కరవు కాలంలో సంబరాలా?

Published Sun, May 29 2016 2:20 AM

కరవు కాలంలో సంబరాలా? - Sakshi

ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
 
 న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రైతులు కరవుతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మోదీ ప్రభుత్వం బాలీవుడ్ నటులతో కలిసి పాటలు, నృత్యాలతో బిజీగా ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీలో విద్యుత్, నీటి కొరతకు నిరసనగా లాంతర్ల ర్యాలీలో శనివారం రాత్రి మాట్లాడుతూ.. దేశమంతా కరవు నెలకొందని, మోదీ ప్రభుత్వం మాత్రం ఇండియా గేటు వద్ద సంబరాలు చేసుకుంటోందని ఆరోపించారు. మరోవైపు ఎన్డీఏ రెండేళ్ల పాలనపై ‘అభివృద్ధి వేగం నిలిచిపోయింది, రెండేళ్లలో దేశం దుస్థితి’ పేరిట 59 పేజీల బుక్‌లెట్‌ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దేశంలో వ్యవసాయ సంక్షోభంతో పాటు అనేక ఇతర సమస్యలుండగా ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారంటూ బుక్‌లెట్‌లో కాంగ్రెస్ మండిపడింది.

 సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి
 సంస్కరణల కోసం ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేయాలని, అందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబంరం ఢిల్లీలో సూచించారు. 2014, జూన్ వరకూ దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని, తర్వాతి కాలంలో ఆర్థిక రంగానికి సంస్కరణలతో ఊతం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఒకరైన రఘురాం రాజన్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా యూపీఏ నియమించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి రాజన్‌తో కలిసి పనిచేసే అర్హత ఉందా? అని తాను ఆలోచిస్తున్నానని చెప్పారు.

Advertisement
Advertisement