అధికారమిస్తే.. ఆవాస హక్కు: రాహుల్ | Sakshi
Sakshi News home page

అధికారమిస్తే.. ఆవాస హక్కు: రాహుల్

Published Fri, Jan 30 2015 3:43 AM

అధికారమిస్తే.. ఆవాస హక్కు: రాహుల్ - Sakshi

న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెనక్కు తేవడంలో దారుణంగా విఫలమైన ప్రధాని నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనలో మాత్రం రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో గురువారం ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఆవాస హక్కు(రైట్ టు షెల్టర్)ను కల్పిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ‘విదేశాల్లో భారతీయులు దాచిన కోట్ల రూపాయల బ్లాక్‌మనీని వెనక్కు తెస్తానని లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ టామ్‌టామ్ చేశారు. ప్రతీ పౌరుడి బ్యాంక్ అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తానన్నారు.
 
  మీ అకౌంట్లోకి ఆ డబ్బులు రాలేదు కానీ ఆయన మాత్రం రూ. 10లక్షల విలువైన సూట్ ధరించారు’ అని ఎద్దేవా చేశారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే స్వచ్ఛ భారత్ అంటూ చీపురు చేతికిచ్చి.. తాను మాత్రం అమెరికా, ఆస్ట్రేలియాలకు వెళ్తాడు’ అంటూ చురకలంటించారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో బీజేపీ  కావాలనే మత విద్వేషాలను రెచ్చగొట్టి ఘర్షణలను సృష్టిస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. గతంలో ప్రతీ అంశంపైనా నిరసనలు, ధర్నాలు నిర్వహించిన కేజ్రీవాల్ ఇప్పుడెందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

Advertisement
Advertisement