అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దు... | Sakshi
Sakshi News home page

అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దు...

Published Mon, Dec 23 2013 12:29 AM

అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దు... - Sakshi

 ‘ముజఫర్’ బాధితులకు రాహుల్ హితవు
 ముజఫర్‌నగర్:అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముజఫర్‌నగర్ బాధితులకు హితవు చెప్పారు. ముజఫర్‌నగర్‌లో ఆదివారం రాహుల్ ఆకస్మికంగా పర్యటించారు. ఇప్పటికీ శిబిరాల్లోనే ఉంటున్న బాధితులను పరామర్శించారు. శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిందిగా సూచించారు. బాధితులు ఇంకా శిబిరాల్లోనే ఉండాలని మత ఘర్షణలకు కారకులైన వారు కోరుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. అయితే, తిరిగి తమపై దాడులు జరిగే అవకాశాలున్నాయని, అందువల్ల గ్రామాలకు వెళ్లబోమని పలువురు బాధితులు చెప్పారు. ముజఫర్‌నగర్, షామ్లీ జిల్లాల్లో బాధితులు తలదాచుకుంటున్న అరడజను శిబిరాలను ఆయన సందర్శించారు. బాధితుల్లో హిందువులను, ముస్లింలను కూడా రాహుల్ కలుసుకున్నారు. కాగా, షామ్లీలోని బాధితుల శిబిరం వద్ద దాదాపు 200 మంది నిరసనకారులు రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకుని, నినాదాలు చేశారు. ముజఫర్‌నగర్‌లో కొద్దిరోజుల కిందట రాహుల్ పర్యటించినప్పుడు పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ... అల్లర్ల బాధితుల్లోని ముస్లిం యువకులతో సంప్రదింపులు జరిపినట్లు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలపై రాహుల్‌ను ప్రశ్నించగా, తమపై ప్రజలు ఆగ్రహంగా లేరని, సమాజ్‌వాదీ కార్యకర్తలే ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. బాధితులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు, వారికి పునరావాసం కల్పించేందుకు సమాజ్‌వాదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. బాధితులను తాను ఎక్కడ కలుసుకున్నా, సౌభ్రాతృత్వం గురించే మాట్లాడానని చెప్పారు. భర్నౌ శిబిరంలో రాహుల్ నేల పైనే కూర్చుని, అక్కడి చిన్నారులతో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో చిక్కుకుని బడికి వెళ్లలేకపోతున్నామని వారు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement