మోదీపై ద్వేషమేం లేదు: రాహుల్‌ | Sakshi
Sakshi News home page

మోదీపై ద్వేషమేం లేదు: రాహుల్‌

Published Thu, Dec 14 2017 1:58 AM

rahul gandhi on narendra modi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన రాజకీయ వైరం ప్రేమ పూర్వకమే తప్ప ద్వేషించుకునే స్థాయిలో లేదని కాబోయే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘మా నాన్న గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినా లేక నన్ను ఎవరైనా తిట్టినా నేను ద్వేషించను, పగతో రగిలిపోను. నాకు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే అంతగా బలపడతా’ అని  అన్నారు. గుజరాత్‌లో 22 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడబోతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ బాగా పనిచేసిందని బీజేపీ నాయకులే అంటున్నారని, దీన్ని బట్టి వాళ్లు పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లే అన్నారు.

బీజేపీ అంగ బలం, అర్థ బలం వాడి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించిందన్నారు. ‘నా నిజాయితీని వక్రీకరించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు ఖర్చు చేసింది. నేను నిజాన్నే నమ్ముతా. అదే మాట్లాడతా. త్వరలో నా నిజం బయటకు వస్తుంది. అయితే దాన్ని చూసేందుకు వారు (బీజేపీ) సిద్ధంగా లేరు’ అని పేర్కొన్నారు. ఆలయ ప్రవేశంపై మాట్లాడుతూ.. ‘దేవాలయాల సందర్శన విషయంలో నాపై ఏదైనా నిషేధం ఉందా? నేను వెళ్లాలి అనుకున్నప్పుడు ఏ ఆలయానికైనా వెళ్తా’ అని తేల్చిచెప్పారు.

ఒకవేళ కాంగ్రెస్‌ ఓడిపోతే ఈ ఫలితాలను మీపై రెఫరెండంగా భావించవచ్చా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకి షాక్‌ ఇవ్వబోతున్నాయని పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గురించి తప్పుగా మాట్లాడిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించే దాక కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని మహిళా విభాగం నిర్వహించిన వర్క్‌షాప్‌లో హెచ్చరించారు. కాగా, రాహుల్‌ వ్యాఖ్యలు ఆయనలోని నిరాశా నిస్పృహలకు అద్దంపడుతున్నాయని బీజేపీ విమర్శించింది.


రాహుల్‌కు ఈసీ షోకాజ్‌ నోటీసులు
న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను ఎన్నికల సంఘం (ఈసీ) రాహుల్‌కు బుధవారం షోకాజ్‌ నోటీసులిచ్చింది. గుజరాత్‌లో రెండో దశ శాసనసభ ఎన్నికలు గురువారంకాగా, ప్రచార సమయం ముగిసినా రాహుల్‌ బుధవారం టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ బీజీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈసీ స్పందించింది. ఇంటర్వ్యూను ప్రసారం చేయడాన్ని తక్షణం నిలిపేయాలని కూడా టీవీ చానళ్లను ఈసీ కోరింది. చానళ్లు సహా చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారందరిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాల్సిందిగా గుజరాత్‌ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది.  

Advertisement
Advertisement