2014లో యువ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

2014లో యువ ప్రభుత్వం

Published Thu, Oct 10 2013 5:03 AM

2014లో యువ ప్రభుత్వం - Sakshi

భూసేకరణ, ఆహార బిల్లులను విపక్షాలు అడ్డుకున్నాయి
వీటికోసం నాతోపాటు సోనియా, మన్మోహన్ ఎంతగానో కష్టపడ్డారు
తదుపరి ప్రభుత్వం దేశ గతినే మార్చేస్తుంది
కనీసం పేదల వద్దకు పోకుండా అంతా తామే చేశామని విపక్షాలు చెప్పుకుంటున్నాయి
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ధ్వజం

 
 రామ్‌పూర్ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యువ మంత్రం జపించారు. 2014 ఎన్నికల తర్వాత యువకులతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇది పేదల కోసం పాటుపడటంతోపాటు దేశగతినే మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో లోక్‌సభ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే 43 ఏళ్ల రాహుల్ గాంధీనే సారథ్యం వహిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బుధవారం రామ్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు.
 
  పేదలు, సాధారణ ప్రజల కోసం యూపీఏ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆహార భద్రత, భూసేకరణలాంటి ముఖ్యమైన బిల్లులను తీసుకొస్తుంటే విపక్షాలు మోకాలడ్డటానికి తీవ్రంగా ప్రయత్నించాయని ధ్వజమెత్తారు. అయితే మన్మోహన్ ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఈ బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ‘భారత్‌లో ఎన్నికల్లో గెలవాలంటే పేదలకు సాయం చేయాలి. వారికోసం పనిచేయాలి. అప్పుడే విజయం సాధించగలం. అయితే మీరు (విపక్షాలు) మాత్రం కనీసం పేదల వద్దకు కూడా వెళ్లకుండా మీడియా సమావేశాలు నిర్వహించి అంతా మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకుంటారు’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ‘2014 ఎన్నికలు సమీపిస్తున్నాయి. అప్పుడు కూడా పేదలు, సామాన్య ప్రజల ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. యువకులతో కూడిన ప్రభుత్వం వస్తుంది. అది దేశ గతినే మార్చేస్తుంది. ప్రతి ఒక్కరూ సాధికారత సాధించేలా మార్పును తీసుకొస్తుంది’ అని పేర్కొన్నారు.
 
 ఈ సందర్భంగా పేదలు, రైతుల కోసం యూపీఏ ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి రాహుల్ వివరించారు. దేశంలో లక్షలాది మంది ఆకలిమంటలతో నిద్రపోతున్నారని, అయితే తాము తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టం దీన్ని మార్చివేసిందన్నారు. దీనికంటే పెద్ద విజయాన్ని ఎవరూ సాధించలేదన్నారు. ఎక్కువ మందికి లబ్ధిచేకూరే ఈ బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎంతగానో ప్రయత్నించాయని రాహుల్ ఆరోపించారు. ‘దీనికోసం మేము మూడేళ్లపాటు కష్టపడ్డాం. నాతోపాటు సోనియాజీ, మన్మోహన్‌జీ దీనికోసం ఎంతగా పోరాడామో మీకు తెలియదు’ అని రాహుల్ చెప్పారు. ఇందిరాగాంధీ కాలం నాటి ‘సగం రొట్టైనా తిందాం.. కాంగ్రెస్‌కు ఓటేద్దాం’ నినాదానికి కాలం చెల్లిందని, ఆహార భద్రత చట్టంతో ఆ నినాదం ‘కడుపునిండుగా తిందాం. కాంగ్రెస్‌ను గెలిపిద్దాం’ అని మారిందన్నారు. ఆహార చట్టాన్ని అమలుచేస్తే ఎక్కడ తమకు లబ్ధిచేకూరుతుందోననే భయంతో యూపీలో అఖిలేష్ ప్రభుత్వం దీన్ని అమలుచేయడం లేదని ఆక్షేపించారు. మహిళల నేతృత్వంలోని రాష్ట్రాలు పురోగతిని సాధిస్తున్నాయంటూ తమిళనాడు (జయలలిత)ను ఉదాహరణగా చెప్పారు.
 
 యూపీలో వరుసగా ఏర్పాటైన ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు ప్రజల కోసం ఏమీ చేయలేదని, అందువల్ల దీన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ పిలుపునిచ్చారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే హింసాత్మక రాజకీయాలకు కాంగ్రెస్ దూరమని, తమ పార్టీ అభివృద్ధి రాజకీయాలనే చేస్తుందని స్పష్టం చేశారు. 50 మంది ప్రజల మృతికి కారణమైన ముజఫర్‌నగర్ అల్లర్లకు సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీనే కారణమని రాహుల్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసమే వారు రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు.
 
 రాహుల్ వాస్తవాలు తెలుసుకో: సుష్మా
 భూసేకరణ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. ధైర్యంతో వాస్తవాలను మాట్లాడాలని హితవుపలికారు. ఆగస్టు 29న పార్లమెంటులో ఈ బిల్లుపై కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ చెప్పిన విషయాలను ఆమె గుర్తుచేశారు. ‘రెండు అఖిలపక్ష సమావేశాల్లోనూ ఈ బిల్లుపై ఎటూ ముందుకుపోలేకుండా ఉన్నప్పుడు సుష్మా దీనికి పరిష్కారం కనుగొన్నారు.
 
 ఆమె వల్లనే నేడు సభలో దీనిపై చర్చిస్తున్నాం. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని జైరామ్ చెప్పిన విషయాన్ని సుష్మా ట్విట్టర్‌లో పొందుపరిచారు. దేశంలో దళితులు, ముస్లింలు దుర్భర స్థితిలో ఉన్నందుకు కాంగ్రెసే కారణమంటూ బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు... రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. స్వాతంత్య్రం తర్వాత పదేళ్లు తప్ప మిగిలిన 57 సంవత్సరాలు దేశాన్ని పాలించింది మీ పార్టీ, మీ కుటుంబమే కదా అని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100కు మించి సీట్లు రావని జోస్యం చెప్పారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలు ఎదగకుండా బీఎస్పీ చీఫ్ మాయావతి అడ్డుకున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడింది.

Advertisement
Advertisement