‘మెర్సల్‌’కు రాజకీయ రంగు | Sakshi
Sakshi News home page

‘మెర్సల్‌’కు రాజకీయ రంగు

Published Sun, Oct 22 2017 1:45 AM

Rahul Gandhi takes dig at PM Modi over Mersal, says don't 'demon .

న్యూఢిల్లీ/తమిళ సినిమా (చెన్నై): తాజా తమిళ చిత్రం ‘మెర్సల్‌’ చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ఈ చిత్రంలో జీఎస్టీ, నోట్లరద్దుపై, భారత్‌లో వైద్య విధానంపై చిత్రీకరించిన కొన్ని సంభాషణలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బీజేపీ, బీజేపీయేతర పక్షాల మధ్య వివాదం రాజుకుంది. చిత్రంలో జీఎస్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని.. వెంటనే వీటిని తొలగించాల్సిందేనని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే.. సంస్కృతితో మమేకమైన తమిళ సినిమాను అగౌరవపరచకూడదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ ట్వీటర్‌లో విమర్శించారు.

చిత్రం లోని దృశ్యాలను తొలగించొద్దని కమల్‌ హాసన్‌ సూచించారు. వివాదం ముదురుతుండటంతో.. మెర్సల్‌ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ వెనక్కు తగ్గింది. బీజేపీ డిమాండ్‌లో న్యాయముందని అంగీకరించిం ది. అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారత్‌లోని వైద్య విధానంలో నాణ్యతాలోపాలు.. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపించాలనే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించాం. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు’ అని చిత్ర యూనిట్‌ సభ్యుడు ఎన్‌ రామస్వామి స్పష్టం చేశారు.  

అసత్యాలతో చిత్రాలు తీస్తారా?: బీజేపీ
తమిళ నటుడు విజయ్‌ కథానాయకుడిగా, సమంత, కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్‌ కథానాయికలుగా నటించిన మెర్సల్‌ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత బుధవారం విడుదలైంది. చిత్రం పతాక సన్నివేశాల్లో.. హీరో విజయ్‌ జీఎస్‌టీ, వైద్య విధానంపై మాట్లాడిన సంభాషణలు వివాదాన్ని రాజేశాయి. బీజేపీ నాయకులు ఈ సంభాషణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి పోన్‌ రాధాకృష్టన్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దుపై అసత్య వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దేశం పరువును తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలోని ఈ దృశ్యాలను తొలగించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

బీజేపీ తీరుపై విమర్శలు
చిత్రంలోని ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు. ‘తమిళ సంస్కృతితో మమేకమైన చిత్ర రంగాన్ని బీజేపీ అవమాన పరచొద్దు’ అని ట్వీట్‌ చేశారు. ‘ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ చిత్రాలు తీయాలంటూ త్వరలోనే కొత్త చట్టం వస్తుంది’ అంటూ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం ఎద్దేవా చేశారు. అటు, తమిళ చిత్ర సెన్సార్‌ బోర్డు ఈ వ్యాఖ్యలకు ఆమోదం తెలిపిన తర్వాత బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని కమల్‌ హాసన్‌ ప్రశ్నించారు. ‘చిత్రాన్ని రీ–సెన్సార్‌ చేయొద్దు. విమర్శలకు సరైన సమాధానం ఇవ్వండి’ అని ట్వీట్‌ చేశారు.

అటు, దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా మెర్సల్‌ చిత్రానికి అండగా నిలిచింది. ‘సెన్సార్‌ బోర్డు ఆమోదం తర్వాత చిత్రంలోని దృశ్యాలను విమర్శించటం.. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం’ అని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉంటుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ పేర్కొన్నారు. చిత్రాల్లోని సన్నివేశాలు, సంభాషణలు తొలగించాలని రాజకీయ నాయకులు శాసిస్తే.. ఇక సెన్సార్‌ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ వివాదంపై హీరో విజయ్‌ స్పందించనప్పటికీ విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ బీజేపీ తీరును విమర్శించారు.  

వివాదం రేపిన డైలాగులు ఇవే!
చిత్రం క్లైమాక్స్‌లో చేతికి బేడీలతో హీరో విజయ్‌ కుమార్‌.. ‘సింగపూర్‌లో 7 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ తీసుకున్నప్పటికీ ఉచితవైద్యం ఎందుకు ఇవ్వటం లేదు. మందులపై 12 శాతం జీఎస్టీ తీసుకుంటారు.. కానీ మన తల్లుల కాపురాల్లో చిచ్చుపెడుతున్న మద్యంపై మాత్రం జీఎస్టీ ఉండదు’ అని అన్నారు.

ఈ డైలాగులపై బీజేపీ మండిపడింది. ‘సింగపూర్‌లో వైద్యం ఉచితం అనేది అబద్ధం. సింగపూర్‌ ప్రజల సంపాదనలో 10 శాతాన్ని సేవింగ్స్‌గా వెనక్కు తీసుకుంటారు. దీన్ని ఇన్సూరెన్స్‌ కోసం వినియోగిస్తారు. ఉచిత వైద్యం లేదు’ అని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్‌ తిరుపతి తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement