రైల్వే పార్సిళ్లకూ డోర్ డెలివరీ | Sakshi
Sakshi News home page

రైల్వే పార్సిళ్లకూ డోర్ డెలివరీ

Published Tue, Jul 8 2014 2:26 PM

రైల్వే పార్సిళ్లకూ డోర్ డెలివరీ

గతంలో ఎన్నడూ లేని విధంగా డోర్ డెలివరీ విధానాన్ని రైల్వేశాఖ చేపట్టబోతోంది. ఇన్నాళ్లూ ఏదైనా పార్సిల్ బుక్ చేసుకోవాల్సి వస్తే, ఒక స్టేషన్లో బుక్ చేసి, గమ్యస్థానం వద్ద కూడా మనమే స్టేషన్కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక అలా అవసరం లేకుండా.. బుక్ చేసిన సరుకులను రైల్వే వర్గాలే నేరుగా ఇంటి వద్దకు డెలివరీ అందించే విధానాన్ని సదానంద గౌడ తన కొత్త బడ్జెట్లో ప్రకటించారు. ఇది ఒకరకంగా విప్లవాత్మకమైన మార్పే. అలాగే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సరుకు రవాణాలో కేవలం 30 శాతం మాత్రమే రైలు మార్గంలో వెళ్తోందని, ఈ వాటాను గణనీయంగా పెచుకోడానికి ప్రత్యేకంగా సరికొత్త డిజైన్లలో పార్సిల్ వ్యాన్లు తీసుకొచ్చి, వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తామని కూడా ఆయన చెప్పారు. ఇంకా, ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్లను ఏర్పాటుచేసి, ఆ మార్గాల్లో సరుకులు మాత్రమే రవాణా అయ్యేలా చేస్తామని, దానివల్ల సరుకు రవాణాకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని గౌడ తెలిపారు.

భద్రతకు పెద్దపీట వేస్తామని, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం కొత్తగా 4వేల మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించి, వారికి సెల్ఫోన్లు కూడా అందజేస్తామని ఆయన అన్నారు. వీటి సాయంతో ప్రయాణికులు ఏ కోచ్ నుంచి అయినా వారిని సంప్రదించొచ్చని వివరించారు.

ప్రయాణికుల సౌకర్యాలు
ఎఫ్ఓబీలు, ఎస్కలేటర్లను ప్రధాన స్టేషన్లలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుచేస్తామని, అన్ని స్టేషన్లలో ప్రైవేటు మార్గాల ద్వారా బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు పెడతాం. వీటివల్ల వృద్ధులు, వికలాంగులు ఏ ప్లాట్ ఫారాల మీదకైనా వెళ్లగలరని గౌడ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలో రిటైరింగ్ రూంలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని.. ఇక మీదట ప్రయాణికులు ఒక రైలును గానీ, బోగీని గానీ, బెర్తును గానీ దేన్నయినా బుక్ చేసుకోవచ్చని సభ్యుల హర్షధ్వానాల మధ్య చెప్పారు.

ఎస్ఎంఎస్ ద్వారా ఫుడ్ ఆర్డర్
ఆహారం నాణ్యత, పరిశుభ్రత పెంచేందుకు రెడీ టు ఈట్ మీల్స్ను ప్రవేశపెడతామని దీనివల్ల కేటరింగ్ నాణ్యత పెరుగుతుందని రైల్వే మంత్రి చెప్పారు. దీని నాణ్యతపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తామని, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణికుల నుంచి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. నాణ్యత లేకపోతే అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సు సైతం రద్దు చేస్తామని అన్నారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామని.. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని వివరించారు.

Advertisement
Advertisement