నో టాయ్‌ లెట్‌.. పవర్‌ కట్‌ | Sakshi
Sakshi News home page

నో టాయ్‌ లెట్‌.. పవర్‌ కట్‌

Published Sun, Aug 20 2017 6:41 PM

Rajasthan Official Controversial Order over Build Toilet

  • వివాదాస్పద ఆదేశాలు.. ఆపై ఉపసంహరణ
  • జైపూర్‌: రాజస్థాన్‌ బిళావర జిల్లాల్లో ఓ అధికారి వివాదాస్పద ఆదేశాలతో వార్తల్లో నిలిచారు. గ్రామంలో మరుగుదొడ్లు లేని ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేయటంతో వివాదస్పదంగా మారింది.

    గంగితల గ్రామంలో కేవలం 19 శాతం ప్రజలే మరుగుదొడ్లు నిర్మించుకోవటం, చాలా మంది బహిర్భూమికి వెళ్లటం సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ కటర్‌ సింగ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో పదే పదే ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఆయన గ్రామస్తులు పట్టించుకోకపోవటంతో కఠిన చర్యలకు దిగారు. 15 రోజుల్లోపు మరుగుదొడ్లు నిర్మించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలా కానీ పక్షంలో ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని డిస్కం అధికారులకు, రేషన్‌ కూడా నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆదేశాలపై తీవ్రస్థాయి విమర్శలు రావటంతో కలెక్టర్‌ ముక్తానంద్‌ అగర్వాల్‌ రంగంలోకి దిగారు.

    కటర్‌ సింగ్‌ వెలువరించిన ఆదేశాలను సవరిస్తూ కేవలం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలకు సూచిస్తూ, కఠిన చర్యలేవీ ఉండబోవని వెల్లడించారు. రెండు రోజుల క్రితం పిపలండ్‌ గ్రామంలో ఇదే రీతిలో బహిర్భూమికి వెళ్లిన ఆరుగురు యువకులను కటర్‌ సింగ్‌ దగ్గరుండి మరీ అరెస్ట్‌ చేయించారు. ఆపై 15 రోజుల్లో మరుగుదొడ్లను నిర్మిస్తామన్న హామీ మేరకు 10,000 పూచీకత్తుతో వాళ్లను విడుదల చేయించారు. ఇక ఈ మధ్యే ఇదే జిల్లాలో ఓ మహిళ భర్త టాయ్‌ లెట్‌ కట్టించలేదన్న కారణంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement