జయలలిత ఆరోగ్యంపై రాజ్‌నాథ్ ఆరా | Sakshi
Sakshi News home page

జయలలిత ఆరోగ్యంపై రాజ్‌నాథ్ ఆరా

Published Sun, Dec 4 2016 10:49 PM

జయలలిత ఆరోగ్యంపై  రాజ్‌నాథ్ ఆరా - Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో చెన్నై అపోలో వైద్యులు ఆమెను స్పెషల్ వార్డు నుంచి ఐసీయూ విభాగంలోకి తరలించి ప్రత్యేక చికిత్స అందజేస్తున్నారు.  మరోవైపు జయలలిత గుండెపోటు సమాచారం తెలియగానే తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చైన్నైకి బయలుదేరారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై చేరుకున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసిన రాజ్‌నాథ్.. జయ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సీఎం జయలలిత ఆరోగ్యం క్షీణించినట్లు అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జయ గుండెపోటలు విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే కీలక నేతలు, కార్యకర్తలు వేలాదిగా చెన్నై అపోలో అస్పత్రికి తరలివస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో గత సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

దీపావళి పండుగ తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వదంతులు ప్రచారం అయినా, పూర్తిగా కోలుకున్న తర్వాతే జయ ఆస్పత్రి నుంచి ఇంటికి వెళతారని అపోలో వైద్యులు అప్పట్లో తెలిపారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం జయలలితకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఐసీయూ వార్డులోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అమ్మ కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, జయ అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement