బాలికపై అత్యాచారం, హత్య | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం, హత్య

Published Thu, Aug 22 2013 5:34 AM

Rape, murder of 8-year-old triggers massive protests in Odisha

భువనేశ్వర్: అత్యాచారాలను నిరోధించి, నిందితులను కఠినంగా శిక్షించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా మార్పు మాత్రం కనిపించడంలేదు. తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ కామాంధుడి ఘాతుకానికి అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలిక బలైపోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భువనేశ్వర్‌లోని సాలియా సాహి మురికివాడలో ఓ కుటుంబం నివసిస్తోంది. అదే వాడకు చెందిన అశోక్ సాహు(22) మంగళవారం వారి దగ్గరకు వచ్చి ఓ వ్యక్తి చిరునామా చూపించాలని కోరాడు.
 
 దీంతో ఆ కుటుంబ సభ్యులు.. నాలుగో తరగతి చదువుతున్న బాలికను అతడితోపాటు పంపించారు. అయితే అశోక్.. ఆమెను అదే మురికివాడలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఎంతసేపటికీ తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా, ఓ మైదానంలో ఆమె శవం కనిపించింది. పోలీసులు అక్కడకు సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజ్ గేటు వద్దనున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా, అశోక్ సాహు నిందితుడని తేలింది. వెంటనే స్థానికులు అతడ్ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు బాధితురాలి కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసులు తెలిపారు.  
 
 అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన...
 బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో ఒడిశా అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ ఘటనపై సీఎం నవీన్‌పట్నాయక్ క్షమాపణ చెబుతూ ఓ ప్రకటన చేయాలని విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, ఆందోళనతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సభలో ఓ ప్రకటన చేశారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ బాధితురాలి కుటుంబానికి సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement