సంస్కరణల అమలు అంతంతే...! | Sakshi
Sakshi News home page

సంస్కరణల అమలు అంతంతే...!

Published Tue, Jul 3 2018 9:51 PM

Reforms In Police Department - Sakshi

పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు సక్రమంగా అమలుకావడం లేదన్నది చర్చనీయాంశమైంది. డీజీపీల నియామకం విషయంలో రాష్ట్రాలు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని, మూడునెలల ముందుగానే సీనియర్‌ అధికారుల జాబితాను యూపీఎస్‌సీకి పంపించి అందులోంచే ఒకరిని డీజీపీగా లేదా నగర కమిషనర్‌గా నియమించాలంటూ నిర్దేశించింది.1861లో బ్రిటీష్‌హయాంలో రూపొందించిన చట్టంలోని మౌలిక ఆలోచనలు ప్రతిబింబించే విధంగానే ఇప్పటికీ దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాల  పోలీస్‌చట్టాలు కొనసాగుతున్నాయి.

మారుతున్న కాలాన్ని బట్టి పోలీస్‌ వ్యవస్థలో నూతన సంస్కరణల అమలు ఆవశ్యకత మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మనదేశ పోలీస్‌వ్యవస్థలో  నేటికీ పాతవాసనలు, అలవాట్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరమరుగుకాలేదు. సుప్రీంకోర్టు తాజాగా పోలీస్‌ సంస్కరణలు పాటించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్కరణల అమలు అవసరాన్ని ఎత్తిచూపుతున్నాయి.

2006 తీర్పులో చెప్పిన అంశాలేమిటీ ?

  • ప్రతిభ ఆధారంగా, పారదర్శక పద్ధతుల్లో సీనియర్‌ అధికారులను డీజీపీ / ఎస్‌పీలుగా నియమించాలి
  • వారు కనీసం రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగేలా పదవీకాలాన్ని ఖరారుచేయాలి
  • ప్రస్తుత డీజీపీ  పదవీ విరమణ మూడునెలలకు ముందుగానే యూపీఎస్‌సీకి అర్హులైన సీనియర్‌ అధికారుల జాబితా పంపించాలి
  • యూపీఎస్‌సీ సూచించిన ముగ్గురు అధికారుల జాబితాలోంచే ఒకరిని ఆ పదవుల్లో నియమించాలి
  • కేసుల దర్యాప్తు, శాంతి,భద్రతల పరిరక్షణ విధులను విభజించి పోలీసులకు దేనికదే ఉండేలా ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి
  • డీఎస్‌పీ అంత కంటే తక్కువ హోదా ఉన్న పోలీసు అధికారుల బదలీలు, పోస్టింగ్‌లు, పదోన్నతులు, ఇతర సర్వీసు సంబంధిత విషయాల్లో సిఫార్సులు చేసేందుకు పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలి
  • పోలీసు కస్టడీలో అత్యాచారం, తీవ్రగాయాలు, లాకప్‌ మరణం వంటి తీవ్రమైన కేసుల్లో ఎస్‌పీ కంటే పై హోదాలో ఉన్న అధికారులపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు పోలీస్‌ కంప్లెయింట్స్‌ అథారిటీని ఏర్పరచాలి
  • కేంద్ర పోలీస్‌ సంస్థ (సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌)ల అధిపతుల ఎంపిక,నియమాకం, వారికి కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండేలా జాతీయస్థాయిలో నేషనల్‌ సెక్యూరిటీ కమిషన్‌ ఏర్పాటుచేయాలి
  • పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం అనవసర ఒత్తిళ్లు, ప్రభావం చూపకుండా ఉండేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో రాష్ట్ర భద్రతా కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఏర్పాటుచేయాలి. రాష్ట్ర పోలీసు పనితీరు మధింపు చేయాలి.


ఆచరణలో అమలు ఎంత ?
పోలీసుల పనితీరు మెరుగు పరిచేందుకు ఉపకరించే దిశలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. పన్నెండేళ్ల తర్వాత కూడా  ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ ఆదేశాలను  పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. 2006 తర్వాత 18 రాష్ట్రాలు మాత్రమే కొత్త పోలీస్‌ చట్టాలు ఆమోదించాయి. మిగతా రాష్ట్రాలు జీవోలు /నోటిఫికేషన్లకే పరిమితమైనట్టు  కామన్వెల్త్‌ హ్యుమన్‌రైట్స్‌ ఇనిషియేటివ్‌ (సీహేచ్‌ఆర్‌ఐ) అధ్యయనంలో వెల్లడైంది.

జమ్మూ,కశ్మీర్, ఒడిశా మినహా అన్ని రాష్ట్రాలు స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్లు (ఎస్‌ఎస్‌సీలు) ఏర్పాటుచేశాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌ మాత్రమే ఎస్‌ఎస్‌సీ వార్షికనివేదికలను ఆ రాష్ట్ర అసెంబ్లీల ఎదుట ఉంచాయి. అయితే ఇందులో ఆరు రాష్ట్రాలు ఎస్‌ఎస్‌సీ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపక్షనేతను చేర్చలేదు. 18 రాష్ట్రాలు నియామకాలకు సంబంధించిన స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదు.

డీజీపీ నియామక మార్గదర్శకాలను 23 రాష్ట్రాలు పట్టించుకోలేదు. దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు విభజించి, దేనికదీగా పోలీసులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలన్న ఆదేశాలను 12 రాష్ట్రాలు అమలు చేయలేదు. పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులపై 12 రాష్ట్రాలు మాత్రమే రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో పోలీస్‌ కంప్లెయింట్స్‌ అథారిటీని (పీసీఏ) ఏర్పాటుచేశాయి. అయితే ఏ ఒక్క రాష్ట్రం కూడా  సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ, నిర్వహణ, కూర్పు విషయంలో పీసీఏ నియమ,నిబంధనలు పాటించడం లేదని ఈ పరిశీలనలో తేలింది. 
 

Advertisement
Advertisement