కాంగ్రెస్‌పై నాడే గాంధీకి అనుమానం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై నాడే గాంధీకి అనుమానం

Published Fri, Sep 27 2013 12:47 AM

కాంగ్రెస్‌పై నాడే గాంధీకి అనుమానం - Sakshi

సాక్షి, చెన్నై: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విభజన స్వభావం ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని దుయ్యబట్టారు. పదవుల కోసం తగవులు పెట్టే తత్వంగల ఆ పార్టీని జాతిపిత మహాత్మా గాంధీ ఆ రోజుల్లోనే అనుమానించి దేశ స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ను రద్దు చేయాలని కోరుకున్నారని చెప్పారు. తమిళనాడులోని తిరుచ్చిలో గురువారం బీజేపీ ‘యువ కమలం’ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఎర్ర కోటను పోలినట్లుగా తీర్చిదిద్దిన సభావేదికపై నుంచి మోడీ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
 
 రెండు నిమిషాలపాటు తమిళంలో మాట్లాడాక హిందీ, ఆంగ్లంలో ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘దేశ స్వాతంత్య్రం కోసం ఆ రోజుల్లో హిందూ ముస్లింలు కలసి పోరాటాలు సాగించారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దు చేయూలని గాంధీ పలుమార్లు సూచించినా ఆ పార్టీ పెద్దలు పెడచెవిన పెట్టారు. మహాత్ముడు కన్నకలలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం దేశ పౌరులపై ఉంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మత కల్లోలాలు, జాతి విద్వేషాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది. అందువల్ల దేశానికి కాంగ్రెస్ పార్టీ చెర నుంచి విముక్తి కల్పించి ఆ పార్టీని తరిమికొట్టాలి.’’ అని మోడీ సూచించారు. ఆధార్ కార్డుల జారీలో చోటుచేసుకున్న అక్రమాలపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తాను మూడేళ్ల క్రితమే ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు.
 
 ఆధార్ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులను ఖర్చు చేశారో ప్రధాని మన్మోహన్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ తరచూ కల్లోలాలు సృష్టిస్తోందని, జవాన్లను హతమారుస్తోందని మోడీ ఆరోపించారు. ప్రభుత్వ పేలవ విదేశాంగ విధానం వల్లే గుజరాత్, తమిళనాడులకు చెందిన జాలర్లను పాకిస్థాన్, శ్రీలంక దళాలు అక్రమంగా నిర్బంధిస్తున్నాయని విమర్శించారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, తమిళనాడు శాఖ అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
 
 కాంగ్రెస్ నినాదం కొత్తదేం కాదు
 కొల్లాం (కేరళ): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ‘సమ్మిళిత అభివృద్ధి’ నినాదాన్ని భుజానికెత్తుకోవడంపై మోడీ పరోక్ష విమర్శలు చేశారు. దేశానికి ఈ నినాదం కొత్తదేమీ కాదని మోడీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక ప్రబోధకురాలు మాతా అమృతానందమయి 60వ పుట్టినరోజును పురస్కరించుకొని కేరళలోని కొల్లాంలో జరిగిన సభలో పాల్గొన్న సందర్భంగా మోడీ మాట్లాడుతూ సమ్మిళిత అభివృద్ధి గురించి వేల ఏళ్ల కిందటే రుషులు ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ వంటి సందేశాలను నాటి పాలకులకు ఉపదేశించారన్నారు. మోడీ అంతకుముందు తిరువనంతపురంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేశారు.

Advertisement
Advertisement