Sakshi News home page

సోలార్ కిడ్స్..!

Published Fri, May 6 2016 8:35 AM

సోలార్ కిడ్స్..! - Sakshi

వైద్య రంగానికి సవాల్ విసురుతున్న పాక్ చిన్నారులు


కరాచీ: ఆ ముగ్గురు చిన్నారులూ సూర్యోదయంతోనే శక్తిని పుంజుకుంటారు. సూర్యాస్తమయం కాగానే శరీరాన్ని కదపలేక నిస్తేజంగా పడుకుంటారు..అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్‌కు చెందిన ఈ ముగ్గురు చిన్నారులూ వైద్యరంగానికే సవాల్ విసురుతున్నారు. ఏడాది వయసుగల షోయబ్, తొమ్మిదేళ్ల వయసున్న రషీద్, 13 ఏళ్ల వయసుగల ఇలియాస్ హసీమ్ సోదరులు. క్వెట్టాకు 15 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వీరు పగలంతా మిగతా పిల్లలమాదిరిగానే ఆడుతూపాడుతూ తిరుగుతున్నారు. కాని సూర్యకాంతి తగ్గుతున్న కొద్దీ వారి శరీరంలోని శక్తి క్షీణించడం మొదలవుతుంది.

మళ్లీ మరుసటి రోజు సూర్య కిరణాలు తాకగానే ఉత్సాహంగా లేస్తారు. దీంతో గ్రామస్తులు వీరిని సోలార్ కిడ్స్‌గా పిలవడం మొదలు పెట్టారు. చికిత్స నిమిత్తం వీరిని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (పిమ్స్) లో చేర్చగా.. ఇటువంటి కేసు మునుపెన్నడూ చూడలేదని, దీనిపై పరిశోధన చేస్తున్నట్లు పిమ్స్ చాన్సెలర్ డాక్టర్ జావెద్ అక్రం తెలిపారు. వీరికి పరీక్షలు నిర్వహించేం దుకు పిమ్స్ 9 మంది నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది.

వీరి రక్త నమూనాలను పరీక్షించి, రిపోర్టులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 అంతర్జాతీయ పరిశోధనా సంస్థలకు పంపించారు. ఇప్పటివరకు వందలాది పరీక్షలు జరిపినా ఎలాంటి ఫలితమూ లేదు. కానీ ఇటీవల జరిపిన పరీక్షలో వచ్చిన ఫలితాల ప్రకారం దీన్ని అత్యంత అరుదైన మస్తీనియా సిండ్రోమ్‌గా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్ప టివరకు 600 మంది ఈ వ్యాధిబారిన పడినట్లు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement