సామాన్యుడికి పెట్రోవాత | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి పెట్రోవాత

Published Thu, Jun 2 2016 3:05 AM

సామాన్యుడికి పెట్రోవాత

ఐదు వారాల్లో పెట్రోల్‌పై రూ.4.47, డీజిల్‌పై రూ.6.46 పెంపు
 
 న్యూఢిల్లీ: విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలు.. ఐదు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.47, డీజిల్ ధర రూ.6.46 పెంపుతో మరిన్ని కష్టాలు పడుతున్నారు.  మంగళవారం లీటర్ పెట్రోల్‌పై రూ.2.58, డీజిల్‌పై రూ.2.26 పెంచడం తెలిసిందే. మే 1 నుంచి పెట్రో ధరలను పెంచడం ఇది మూడోసారి. మే 1న లీటర్ పెట్రోల్ ధరను రూ.1.06, మే 17న రూ. 0.83 పెంచారు. డీజిల్‌పై మే 1న రూ. 2.94, మే 17న రూ.1.26ను ఆయిల్ కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఈ ఏడాదిలో పెట్రో ధరలు గరిష్ట రిటైల్ రేటుకు చేరుకున్నాయి. ఇక ఏప్రిల్ 16న చివరిసారిగా ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించింది.

అప్పుడు పెట్రోల్‌పై రూ.0.74, డీజిల్‌పై రూ.1.30 పైసలను తగ్గించింది. మార్చి నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధర రూ.8.99, డీజిల్ ధర రూ.9.79 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గినపుడు కూడా కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించకుండా.. లాభాన్ని పెంచుకునేందుకు ఎక్సైజ్ సుంకాన్ని 9రెట్లు పెంచింది. దీనివల్ల పెట్రోల్‌పై రూ. 11.77, డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది. కంపెనీలు పెట్రో ధరలు పెంచడంతో గోవా ప్రభుత్వం పెట్రోల్‌పై 20 శాతంగా ఉన్న వ్యాట్‌ను 15 శాతానికి తగ్గించింది. పెంపును ఉపసంహరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
 
 సబ్సిడీయేతర సిలిండర్‌పై  రూ.21 పెంపు
 సబ్సిడీయేతర 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 21 పెరిగింది. ఢిల్లీలో ధర రూ. 527.50 నుంచి రూ.548.50కు చేరింది. కాగా, 2016-17 బడ్జెట్‌లో పేర్కొన్నట్లు 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సినిమా టికెట్లు, హోటల్ బిల్లులు, బ్యాంకింగ్ లావాదేవీలు తదిరాలపై  సేవాపన్ను  15 శాతానికి చేరింది.

Advertisement
Advertisement