హైవేలు రయ్‌.. రయ్‌.. | Sakshi
Sakshi News home page

హైవేలు రయ్‌.. రయ్‌..

Published Thu, Feb 2 2017 3:52 AM

హైవేలు రయ్‌.. రయ్‌..

జాతీయ రహదారులకు రూ. 64,900 కోట్లు

  • గత ఏడాదికన్నా 12శాతం అధికం
  • పీఎంజీఎస్‌వైకి రూ.19,000 కోట్లు
  • కొత్తగా 2 వేల కి.మీ.ల తీరప్రాంత కనెక్టివిటీ రోడ్లు

న్యూఢిల్లీ: 2017–18లో నేషనల్‌ హైవేలకు కేటాయింపులను 12 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. మొత్తం కేటాయింపులు రూ. 64,900 కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. హైవేల రంగానికి సంబంధించి 2016–17 బడ్జెట్‌ అంచనాలు రూ.57,976 కోట్లుగా ఉండగా.. సవరించిన అంచనాలు రూ. 52,447 కోట్లు అని ఆయన తెలిపారు.  2017–18 బడ్జెట్‌ అంచనాలను రూ. 64,900 కోట్లకు పెంచుతున్నాం.’’ అని జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రైల్వేలు, రహదారులు, షిప్పింగ్‌ కలపి మొత్తం రవాణా రంగానికి సంబంధించి కేటాయింపులు రూ. 2.41 లక్షల కోట్లకు చేరుకున్నట్లు జైట్లీ తెలిపారు.

2,000 కిలోమీటర్ల మేర తీరప్రాంతాలను కలిపే రహదారులను గుర్తించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని నిర్మించి అభివృద్ధి చేస్తామని జైట్లీ వెల్లడించారు. దీనివల్ల దూరప్రాంతాలలోని గ్రామాలకు నౌకాశ్రయాలున్న ప్రాంతాలకు మధ్య రహదారుల సదుపాయాలు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన రహదారులు సహా 2014–15 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 1,40,000 కి.మీ.లకు పైగా రహదారులను నిర్మించామని, అంతకుముందు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువని జైట్లీ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో 100మందికి పైన ఉండే తండాలను కలుపుతూ రహదారులను నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ వివరించారు. 2017–18లో పీఎంజీఎస్‌వైకి రూ.19,000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాల వాటాతో కలిపి 2017–18లో ఈ పథకం కింద రూ.27,000 కోట్లను వెచ్చించనున్నామని వివరించారు.

విమానాశ్రయాల నిర్వహణలో ‘ప్రైవేటు’
ఎంపిక చేసిన ద్వితీయశ్రేణి నగరాలలోని విమానాశ్రయాలలో కార్యకలాపాల నిర్వహణ ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నట్లు జైట్లీ వెల్లడించారు. భూముల రూపంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వీలు కల్పించేలా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement