కన్నూర్‌ రక్త చరిత్ర! | Sakshi
Sakshi News home page

కన్నూర్‌ రక్త చరిత్ర!

Published Sat, Mar 4 2017 6:52 PM

కన్నూర్‌ రక్త చరిత్ర!

ఎరుపు, కాషాయ పక్షాల మధ్య ఎడతెగని రక్తపాతం

కొచ్చి: వందలాది ఆరెసెస్‌ కార్యకర్తల హత్యకు కారణమైన సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తల నరికిన వారికి కోటి రూపాయలిస్తానని మధ్యప్రదేశ్‌ ఆరెసెస్‌ నేత కుందన్‌ చంద్రావత్‌ బహిరంగ ప్రకటనతో ఉత్తర కేరళ జిల్లా కన్నూర్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గత 45–50 ఏళ్లలో ఇక్కడ ఆరెస్సెస్‌–మార్క్సిస్టు పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ‘వందలాది’Sమంది మరణించారని అంచనా. ముఖ్యంగా 1990ల నుంచి జరుగుతున్న కన్నూర్‌ హింసాకాండ పాశవికంగా మారింది. క్లాసురూముల్లో పాఠాలు చెబుతున్న సీపీఎం, ఆరెస్సెస్‌ నేతలను(ఉపాధ్యాయులు) విద్యార్థుల ముందే కత్తులు, గొడ్డళ్లతో నరకి చంపడం దేశ ప్రజలందరిని పదేళ్ల క్రితమే కలవరపరిచింది.

ఎన్ని శాంతి సమావేశాలు పెట్టినా రెండు రాజకీయ పక్షాల మధ్య హింసకు ముగింపు లేకుండాపోయింది. వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న కన్నూర్‌ పూర్వపు మలబార్‌ (కేరళలో చేరక ముందు మద్రాసు రాష్ట్రం) జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. తొలితరం కమ్యూనిస్ట్‌ యోధుడు ఏకే గోపాలన్, సీపీఎం మాజీ సీఎం ఈకే నయనార్, ఇప్పటి సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్‌ మాజీ సీఎం కె.కరుణాకరన్, కేంద్ర మాజీమంత్రులు ఇ. అహ్మద్, సీఎం ఇబ్రాహీం కన్నూర్‌లో పుట్టినవాళ్లే. హిందూ కుటుంబాల్లో పుట్టిన నేతల్లో ఒక్క నయనార్‌ తప్ప మిగిలిన ముగురూ బీసీ వర్గమైన ఈళవ(తియ్యా)లే.

బీడీ పరిశ్రమతో మొదలైన వివాదం!
50 ఏళ్ల క్రితం ఇక్కడ బీడీ పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ రంగంలోని కార్మికులకు వేతనాలు, సౌకర్యాలు పెంచడంలో కమ్యూనిస్టు కార్మిక సంఘాలు విజయం సాధించాక, గణేష్‌ బీడీ వర్క్స్‌ వంటి పెద్ద కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. మిగిలిన కంపెనీలు ఆరెసెస్‌ అనుకూల కార్మికులను కాంట్రాక్టు పద్ధతిపై చేర్చుకోవడంతో కాషాయ పరివార్, కమ్యూనిస్ట్‌ అనుబంధ సంస్థల మధ్య విద్వేషాలు పెరిగాయి. మంగళూరుకు చెందిన ఓ మైనారిటీ వ్యాపారి కన్నూరుకు వాణిజ్యకార్యకలాపాలు విస్తరించడంతో స్థానిక హిందూ వ్యాపారుల నుంచి సంఘ్‌ పరివార్‌ సంస్థలకు సహకారం లభించింది. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. మైనారిటీల తరఫున కమ్యూనిస్టులు ‘నిలబడ్డారు.’

దాదాపు 70 ఏళ్ల క్రితమే రాజకీయ దాడులు ప్రారంభం
1948లో కన్నూరులో ఆరెస్సెస్‌ మూడో ఛీప్‌ ‘గురూజీ’  ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ఊరేగింపులపై జరిగిన దాడులతో రాజకీయ హింస ఆరంభమైందని చెబుతారు. జిల్లాలోని తలసేరీలో 1971లో భారీగా జరిగిన హిందూ–ముస్లిం ఘర్షణలు రెండు పక్షాల మధ్య శాశ్వత ఘర్షణలకు పునాదివేశాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ హయాంలతో పోల్చితే సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌ పాలనలోనే రాజకీయ ఘర్షణలు ఎక్కువ జరిగాయని మీడియా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 30 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో కల్లుగీత వృత్తిదారులైన తియ్యాలు 30 శాతం వరకూ ఉండడంతో సాంస్కృతిక  సంస్థగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహా అన్నిపార్టీల నేతలు, క్రియాశీల కార్యకర్తలు తియ్యాలే. అందుకే సీపీఎం–ఆరెస్సెస్‌ ఘర్షణల్లో మరణించిన, గాయపడినవారిలో 90 శాతానికి పైగా ఈ కులంవారే ఉన్నారు.

14 శాతానికి పెరిగిన బీజేపీ ఓట్లు!
దీంతో పాతికేళ్ల నుంచీ జిల్లాలో బీజేపీ అనూహ్యంగా బలం పెంచుకుంది. ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు గెలిచే బలం ఎక్కడా లేకున్నా 2016 ఎన్నికల్లో సగటున దాదాపు 14 శాతం ఓట్లను ‘కమలం’  అభ్యర్థులు సాధించారు. 1930ల నుంచీ అంటే దాదాపు 95 ఏళ్లుగా ‘ఎర్రకోట’గా పేరొందిన కన్నూరు జిల్లాలో కాషాయ బలగాల విస్తరణను ‘కత్తికి కత్తితో’ కామ్రేడ్లు ప్రతిఘటించడంతో రాజకీయ హత్యలు గత పదేళ్లుగా విపరీతంగా పెరిగాయి. 2000– 2016 మధ్య 66 రాజకీయ హత్యలు జరిగాయి. 2008లో అత్యధికంగా 14 జరిగితే, 2003, 2013లో మాత్రమే ఎలాంటి హత్యలు జరగలేదు. 2016లో రెండు పక్షాల మధ్య దాదాపు 600 రాజకీయ ఘర్షణలు జరగ్గా అందులో ఏడుగురు మరణించారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడే ఘర్షణలు పెరగడం, ఇది సీఎం విజయన్‌ సొంత జిల్లా కావడంతో రాజకీయ కొట్లాటలకు స్వస్తి పలకడానికి ఎల్డీఎఫ్‌ సీఎం కిందటేడాది శాంతి సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది.

తాజాగా ఉజ్జయిన్‌ ఆరెస్సెస్‌ సహ ప్రచార్‌ ప్రముఖ్‌ చేసిన ప్రకటనతో సంఘ్‌పరివార్‌కు ప్రచారపరమైన నష్టం జరిగిందనే విషయం నేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలో  కన్నూరు రాజకీయ ఘర్షణలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. మొత్తానికి కన్నూర్‌ రాజకీయ ఘర్షణలు 1970లు, 80ల్లో ఖమ్మం జిల్లాలో సీపీఎం, సీపీఐ కార్యకర్తల మధ్య, వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రాంతంలో అప్పటి సీపీఎం ఎమ్మెల్యే మద్దికాయల ఓకాంర్‌ అనుచరులు,æ సీపీఐఎంఎల్‌–పీపుల్స్‌వార్‌ మధ్య, ఇంకా నల్లగొండ జిల్లా సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతంలో కాంగ్రెస్‌(మాజీ ఎమ్మెల్యే చకిలం శ్రీనివాసరావు నేతృత్వంలో), సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు పాత తరం రాజకీయ పరిశీలకులకు గుర్తుకు తెప్పిస్తున్నాయి.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement
Advertisement