జంట ఎలాగున్నా.. సూపర్‌బేబి పుడుతుందట | Sakshi
Sakshi News home page

జంట ఎలాగున్నా.. సూపర్‌బేబి పుడుతుందట

Published Sun, May 7 2017 6:25 PM

జంట ఎలాగున్నా.. సూపర్‌బేబి పుడుతుందట

న్యూఢిల్లీ: 'భార్యభర్తలు నలుపా?. అయినా మా పద్ధతులు అనుసరిస్తే మీ శిశువులు అందంగా, తెల్లగా పుడతారు. అంతేకాదు అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ ఎలాంటి కార్యన్నైనా ఒంటి చేత్తో గెలుచుకురాగల సమర్ధులవుతారు. క్రియేటివ్‌ గా ఆలోచిస్తారు. వారికి ఎదురే ఉండదు.' ఇది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)కు చెందిన మెడికల్‌ వింగ్‌ ఆరోగ్య భారతి 'గర్భ్‌ సంస్కార్‌' కార్యక్రమ ప్రచార సారాంశం.

తల్లిదండ్రులు కాబోతున్న జంటలు శిశువుకు జన్మినిచ్చే ముందు అనుసరించాల్సిన పద్దతుల గురించి తాము చెబుతామని, ఇందుకు జంటలు వర్క్‌షాపులో చేరాలని కోరింది. పూర్తి వివరాలకు 'గర్భ్‌విజ్ఞాన అనుసంధాన కేంద్రం' పేరుతో వెబ్‌సైట్‌ను విజిట్‌ చేయాలని చెప్పింది. ఆరోగ్యభారతి కన్వీనర్‌ జానీ మాట్లాడుతూ గర్భ్‌సంస్కార్‌ పద్ధతి ద్వారా తల్లిదండ్రులకు చదువు లేకపోయినా లేదా కొద్ది మొత్తంలో చదువుకున్నా బిడ్డలు మాత్రం మంచి తెలివితేటలతో జన్మిస్తారని పేర్కొన్నారు.

దంపతులు చెప్పిన పద్ధతిని సరిగా అనుసరిస్తే బిడ్డలు మంచి రంగుతో పాటు ఎత్తు కూడా పెరుగుతారని వివరించారు. ప్రస్తుతం గుజరాత్‌లో ప్రారంభమైన ప్రాజెక్టును 2020 కల్లా అన్ని రాష్ట్రాలకు వ్యాపింపజేస్తామని చెప్పారు. కాగా, నలుపు, తెలుపు అంటూ వర్ణ భేదాలను చూపుతూ ప్రచారంలో ఆరోగ్య భారతి ఉపయోగించిన భాష జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతుందని పలువురు అంటున్నారు. మరైతే గాంధీజీ, అంబేద్కర్‌ లాంటి ఎందరో మహానుభావుల తల్లిదండ్రులు ఏం చదువుకున్నారని వారు అంత గొప్పవారు అయ్యారని వారు ప్రశ్నిస్తున్నారు.

జానీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్‌ బాలల హక్కుల కమిషన్‌ హైకోర్టును ఆశ్రయించింది. శిశువుల రంగు తేడాను చూపడం జాతి వివక్ష అవుతుందని పిటిషన్‌లో పేర్కొంది. సంస్కార్‌ పద్ధతి అంటూ ఆరోగ్యభారతి చేస్తున్న వ్యాఖ్యలు సమాజానికి చేటు చేసే విధంగా ఉన్నాయని వాదించింది. పిటిషనర్‌ తరఫు వాదనలను పూర్తిగా విన్న కలకత్తా హైకోర్టు కొన్ని ఆంక్షలతో ఓ వర్క్‌షాపును నగరంలో నిర్వహించేందుకు అనుమతిచ్చింది. వర్క్‌షాపు నిర్వహించినందుకు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని, కేవలం ఒకే క్లాసును నిర్వహించాలని, క్లాసు జరిగినంతసేపు దాన్ని వీడియో రికార్డు చేసి కోర్టుకు అప్పగించాలని కోల్‌కతా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్యభారతి వెబ్‌సైట్‌లో ఏముంది?
'గర్భ్‌ సంస్కార్‌' పద్ధతి ద్వారా సూపర్‌ బేబీ కల సాకారం చేసుకోవచ్చని ఉంది. పిండం గర్భంలో ఉండగానే కొన్ని పద్ధతుల ద్వారా బిడ్డకు నేర్చుకోవడం లాంటి తదితర అంశాలను అలవాటు చేస్తామని వివరించింది. శాస్త్రీయ బద్దమైన ఈ పద్ధతి ద్వారా ఇప్పటివరకూ 450మంది సూపర్‌బేబీలు జన్మించారని పేర్కొంది. ఇందుకోసం తల్లిదండ్రులు కర్మ సిద్ధాంతాలను అనుసరించాల్సివుంటుందని వివరించింది. బిడ్డ జన్మించిన అనంతరం మిగిలిన శిశువుల కంటే వేగంగా ఏ విషయాన్నైనా ఇట్టే నేర్చుకుంటారని తెలిపింది.


ధైర్య సాహసాలను ప్రదర్శించడమే కాకుండా తెలివితేటలతో సులువైన మార్గాలను వీరు అనుసరిస్తారని చెప్పింది. అంతేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు వీరికి సోకవని తెలిపింది. ఇందుకోసం తాము సూచించిన ఆయుర్వేదిక్‌ హెర్బ్స్‌, పంచకర్మ థెరపీలు, క్రమానుగతమైన ఆహారం, యోగా, మ్యూజిక్‌ సీడీలు, మరికొన్ని యాక్టివ్‌ ప్లాన్‌లను అనుసరించాల్సివుంటుందని వెబ్‌సైట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement