జైల్లోనూ జయకు తోడుగా.. | Sakshi
Sakshi News home page

జైల్లోనూ జయకు తోడుగా..

Published Mon, Sep 29 2014 9:31 AM

జైల్లోనూ జయకు తోడుగా..

ఒకటి కాదు.. రెండు కాదు.. 32 ఏళ్లుగా జయలలితకు ఆమె తోడుగానే ఉంటున్నారు. అందుకే జైల్లో కూడా ఆ తోడు వీడకుండా వెంనటే ఉన్నారు. ఆమె ఎవరో ఈపాటికే తెలిసి ఉంటుంది కదూ.. అవును శశికళ! మూడుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు తొలిసారిగా 1982లో వి.ఎస్.చంద్రలేఖ అనే ఐఏఎస్ అధికారిణి శశికళను పరిచయం చేశారు. అప్పటికి జయలలిత రాజ్యసభ ఎంపీ. శశికళకు అప్పటికి ఓ వీడియో పార్లర్ ఉండేది. ఆమె భర్త నటరాజన్ రాష్ట్ర ప్రభుత్వంలో పీఆర్వోగా పనిచేసేవారు. ఇప్పుడు శశికళ పరిస్థితి చూస్తే.. జయలలిత అంత కాకపోయినా దాదాపు అదే స్థాయిలో ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నారు, ఇప్పుడు జైలు జీవితం కూడా పంచుకుంటున్నారు. 2011లో మాత్రం శశికళ బంధువులు కొంతమంది జయకు వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న  వార్తలు వచ్చినప్పుడు వాళ్లనే వదులుకున్నారు తప్ప జయలలితను మాత్రం వదల్లేదు. చివరకు తన భర్తకు కూడా చాలాకాలం పాటు దూరంగానే ఉన్నారు.

1982 నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సందర్భాల్లోనే జయలలిత తోడును శశికళ వీడారు. తొలిసారి 1995-96లో ఆమెను జేజేటీవీ పరికరాల దిగుమతి కేసులో ఈడీ అరెస్టు చేసింది. రెండోసారి 1996 మేలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయలలితే ఆమెను తన ఇంటినుంచి బయటకు పంపేశారు. మూడోసారి ఆమెతో పాటు మరో 11 మంది బంధువులను 2011లో జయలలిత ఇంట్లోంచి పంపేశారు.

శశికళ గురించి అందరికీ తెలిసిన విషయాలకు, ఆమెకు లభించే ప్రాధాన్యానికి ఏమాత్రం పొంతన ఉండదు. గత మూడు దశాబ్దాలుగా జయలలిత ఫొటోలు ఎన్ని చూసినా దాదాపు ప్రతిదాంట్లోనూ పక్కన శశికళ ఉంటూనే ఉంటారు. జయలలితతో స్నేహం అంటే చాలా కష్టమని, అయినా ప్రతిసారీ శశికళ మాత్రం ఆ కష్టాన్ని అధిగమిస్తూనే ముందుకు వెళ్లగలిగారని శశికి, నటరాజన్కు సన్నిహితంగా ఉండే ఓ న్యాయవాది చెప్పారు. జయలలితకు వందకోట్ల జరిమానా విధిస్తే.. శశికళకు పది కోట్ల రూపాయల జరిమానా విధించారంటేనే.. ఆమె ఎంత సంపాదించి ఉంటారో, ఆమె స్థాయి ఏంటో తెలుస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement