‘జనగణమనపై సుప్రీం ససేమిరా.. వారికి ఓకే’ | Sakshi
Sakshi News home page

‘జనగణమనపై సుప్రీం ససేమిరా.. వారికి ఓకే’

Published Fri, Dec 9 2016 6:16 PM

‘జనగణమనపై సుప్రీం ససేమిరా.. వారికి ఓకే’ - Sakshi

ఢిల్లీ: అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అయితే, ప్రత్యేక అవసరాలుగల వారికి మాత్రం ఈ జాతీయ గీతం విషయంలో మినహాయింపునిచ్చింది. జాతీయ గీతం ప్రదర్శితమవుతున్న సమయంలో దివ్యాంగులు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పింది. కాకపోతే, ఎవరైన ప్రశ్నించినప్పుడు తమ పరిస్థితి అర్థమయ్యేలా ఏదో ఒక సంకేతం సూచిస్తే సరిపోతుందని తెలిపింది. అలాగే, కావాలంటే థియేటర్‌కు తలుపులు దగ్గరికి వేసుకోవచ్చని, అయితే, గడియ మాత్రం పెట్టొద్దని స్పష్టం చేసింది.

సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మరోసారి పునఃసమీక్షించాలంటూ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, గీతం ప్రదర్శించి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కేరళలో అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్న సభ్యులు తాజాగా జాతీయ గీతం ప్రదర్శనపై పిటిషన్‌ వేశారు. ఈ చిత్రోత్సవానికి దాదాపు 1500మంది విదేశీయులు వస్తున్నారని, ఈ నేపథ్యంలో కొంత వెసులుబాటును ఇప్పించాలని అందులో కోరారు. అయితే, న్యాయస్థానం అందుకు ససేమిరా అంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement