‘పద్మావతి’ వాయిదా వెనక సీక్రెట్‌ | Sakshi
Sakshi News home page

‘పద్మావతి’ వాయిదా వెనక సీక్రెట్‌

Published Mon, Nov 20 2017 3:10 PM

secret behind the padmavati postpone - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన సంజయ్‌ లీలా బన్సాలీ బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావతి’ విడుదలను కొన్ని హిందూ శక్తుల బెదిరింపులకు భయపడి నిరవధికంగా వాయిదా వేయడం పట్ల సోషల్‌ మీడియాలో ముఖ్యంగా, ట్విట్టర్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త మంది దీన్ని హిందూ శక్తుల విజయంగా వ్యాఖ్యానిస్తుండగా, ఎక్కువ మంది ఇది ప్రజాస్వామ్యానికి ఓటమని, ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని వ్యాఖ్యానిస్తున్నారు. భారత యావత్‌ చలనచిత్ర పరిశ్రమ సంఘటితంగా నిలబడి ఉంటే నేడు ‘పద్మావతి’కి ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇందుకు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారంతా సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.

గోవాలో ప్రారంభమవుతున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే భారతీయ సినిమాల జాబితా నుంచి ఎస్‌. దుర్గా, న్యూడ్‌ చిత్రాలను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు తొలగించడం పట్ల వివాదం రాజకున్న తరుణంలోనే పద్మావతి వివాదం తారాస్థాయికి చేరుకుంది. పద్మావతి సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే అంటే, గత జనవరి నెలలో సినిమాకు వ్యతిరేకంగా కొన్ని హిందూ శక్తులు ఆందోళనలు నిర్వహించాయి. సినిమా షూటింగ్‌ సెట్‌లను దగ్ధం చేయడం దగ్గరి నుంచి పద్మావతి దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీని తల నరికిన వాడికి పది కోట్లు హిస్తామని, పద్మావతిగా సినిమాలో నటించిన దీపికా పదుకొణె ముక్కు కోసిన వ్యక్తికి కోటి రూపాయలు, ఆమెను నిలువున తగులబెట్టిన వ్యక్తికి మరో కోటి రూపాయలు ఇస్తామని బెదిరిస్తూ వచ్చాయి. ఓ బీజేపీ ఎమ్మెల్యేనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.

ఇలాంటి బెదిరింపులను సినీ పరిశ్రమ సంఘటితంగా ఎదుర్కోక పోవడం వల్లనే నేడు పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయాల్సి వచ్చిందని, ఇది నిజంగా గూండాల విజయమని ఎక్కువ మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంతటి బెదిరింపులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం ఏమిటని, ముఖ్యంగా సినిమా పరిశ్రమ పట్ల ఆసక్తి చూపించే స్మతి ఇరానీ లాంటి వారు కూడా బాలీవుడ్‌ నటి పదుకొణేను అంతగా బెదిరిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని ట్వీటర్లు ప్రశ్నిస్తున్నారు.

గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓ రాజకీయ పార్టీ లబ్ధి పొందడం కోసమే కొన్ని హిందూ శక్తులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని, ఎన్నికల అనంతరం ఆందోళన సద్దుమణుగుతోందని ఆ పార్టీ ప్రభుత్వమే భరోసా ఇవ్వడంతోనే పద్మావతి విడుదలను వాయిదా వేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘టైగర్‌ జిందా హై’ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన విడుదల కావాల్సి ఉందని,  ఆ సమయంలో పద్మావతి విడుదలయితే తమకు ఇబ్బంది అవుతుందని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి స్థానంలో అంటే, డిసెంబర్‌ ఒకటవ తేదీన ‘టైగర్‌ జిందా హై’ చిత్రాన్ని విడుదలకు చర్యలు తీసుకోవాలని వారు ఆ సినిమా నిర్మాతలను కోరుతున్నట్లు తెల్సింది.

Advertisement
Advertisement