ఢిల్లీకి ‘ఉగ్ర’ ముప్పు | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ‘ఉగ్ర’ ముప్పు

Published Sat, Aug 10 2013 1:32 AM

ఢిల్లీకి  ‘ఉగ్ర’ ముప్పు

పంద్రాగస్టు నేపథ్యంలో దాడులకు లష్కరే కుట్ర
     ఎర్రకోట, ప్రధాన మార్కెట్లలో  భారీ విధ్వంసానికి రెక్కీ
     తమ ఉగ్రవాదులు హస్తినలో దాడి చేస్తారని గత నెలలో సయీద్ ప్రకటన

 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. పంద్రాగస్టు నేపథ్యంలో ఢిల్లీ చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు రద్దీగా ఉండే ప్రధాన మార్కెట్లలో భారీ దాడులకు లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు సమాచారం. దీని కోసం రెక్కీలు కూడా చేసినట్లు నిఘా సంస్థ(ఐబీ) పసిగట్టింది. దీంతో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. పంద్రాగస్టు, ఆ తర్వాత రాఖీ తదితర పండుగలు రానున్న నేపథ్యంలో ఎర్రకోట, చాందినీ చౌక్, కన్నాట్‌ప్లేస్, ఢిల్లీ కంటోన్మెంట్‌లలో దాడులకు ముష్కరులు వారం కిందట రెక్కీ చేశారని ఐబీ నగర పోలీసులకు తెలిపింది. తమ ఉగ్రవాదులు హస్తినలో దాడులకు పాల్పడతారని లష్కరే తోయిబా నేత సయీద్ హఫీజ్ గత నెల పాక్‌లో ఓ ప్రసంగంలో హెచ్చరించినట్లు తెలిపింది. ‘ముంబై’ దాడుల ఉగ్రవాది కసబ్ ఉరికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. దీంతో పోలీసులు ప్రధాన మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
 తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనున్న ఎర్రకోటతోపాటు, పార్లమెంటు వద్ద నిఘాను పటిష్టం చేశారు. పంద్రాగస్టు, రాఖీ, కృష్ణ జన్మాష్టమి వంటి వేడుకల్లో మార్కెట్లు రద్దీగా ఉంటాయని కనుక ఉగ్రవాదులు దాడుల కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం. 2000లో ఎర్రకోటపై జరిగిన ఉగ్రదాడిని పునరావృతం చేయాలని సయీద్ పిలుపునిచ్చిన ట్లు తెలుస్తోంది. కాశ్మీర్, పాలస్తీనా, మయన్మార్‌లలో అణచివేతకు గురవుతున్నవారు ఈద్‌ను స్వేచ్ఛగా జరుపుకునే రోజు దగ్గర్లోనే ఉందని హఫీజ్ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యల వెనుక  దాడుల హెచ్చరిక ఉందని నిఘా వర్గాల అనుమానం. సయీద్ లాహోర్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ప్రసంగింస్తూ.. కసబ్ ఉరికి ప్రతీకారం తీసుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement