ఎయిర్‌పోర్టుల్లో ఎమ్మార్పీకే టీ, స్నాక్స్‌!

9 Sep, 2018 03:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వాధీనంలోని 90కి పైగా విమానాశ్రయాల్లో కొన్ని రకాల తినుబండారాలు, పానీయాలు ఇకపై సరసమైన ధరలకే లభించనున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) శనివారం ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లోని విమానాశ్రయాలకు ఇది వర్తించదు. పలు వస్తువులను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే అమ్మేందుకు ఎయిర్‌పోర్టుల్లోని వ్యాపారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకుంటారని ఏఏఐ అధికారి ఒకరు చెప్పారు. టీ, కాఫీ వంటి వాటినీ అత్యధిక ధరలకు అమ్ముతున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. మధ్య తరగతి వారు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్న అంశాన్ని పరిగణనలోని తీసుకుని పలు వస్తువులను ఎమ్మార్పీకే అమ్మేందుకు నిర్ణయించామని ఏఏఐ అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు