‘అమ్మ’ బాటలోనే పయనిస్తా | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ బాటలోనే పయనిస్తా

Published Sun, Jan 1 2017 2:05 AM

‘అమ్మ’ బాటలోనే పయనిస్తా

- ఆమె ఆశయాలను నెరవేరుస్తాను
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ  

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చూపిన బాటలో పయనిస్తూ ఆమె ఆశయాలను నెరవేరుస్తానని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. తన జీవితాన్ని అన్నాడీఎంకేకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా జయలలిత వినియోగించిన కారులోనే, ఆమెలానే ఆకుపచ్చ చీర ధరించి పోయెస్‌ గార్డెన్‌ నుంచి శశికళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెకు సీఎం పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదన్‌ ఆహ్వానం పలికారు. ముందుగా ప్రాంగణంలోని ఎంజీ రామచంద్రన్‌(ఎమ్జీఆర్‌) విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం ప్రధాన కార్యదర్శిగా శశకళ బాధ్యతలు చేపట్టారు.

అనంతరం ఆమె కొంత భావోద్వేగంతో జయలలితను గుర్తు చేసుకున్నారు. ఆమె ఎప్పటికీ తన హృదయంలో నిలిచి ఉంటుందన్నారు. జయలలితతో కలసి సుమారు వెయ్యికి పైగా సభల్లో పాల్గొన్నానని, ఆమెతో పాటు అన్ని చోట్లకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అలాంటిది ఈరోజు ఆమె స్థానంలో తానే వేదిక పైకి వచ్చి ప్రసంగించాల్సిన వస్తోందని కలలో కూడా ఊహించలేదన్నారు. జయలలిత 74 రోజుల పాటు పోరాడారని, కానీ దేవుడు తనకు ఇష్టమైన బిడ్డను తన వద్దకు పిలుచుకువెళ్లాడని పేర్కొన్నారు. జయ వదిలి వెళ్లిన బాధ్యతలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

నియామకంపై నిరసనలు..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరు వళ్లూరు జిల్లాకు చెందిన స్వాతి అనంద్‌(42) అనే కార్యకర్త మెరీనా బీచ్‌లోని ‘అమ్మ’ సమాధి వద్దకు చేరుకుని శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హఠాత్తుగా విషం తాగాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, శశికళ నియామకంపై మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్‌ నేత నాంజిల్‌ సంపత్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన డీఎంకేలో చేరేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement