ఓటర్ల జాబితాలో షిర్డీ సాయిబాబా పేరు | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాలో షిర్డీ సాయిబాబా పేరు

Published Thu, Aug 30 2018 12:02 PM

Shirdi Saibabas Name Found In Voter List - Sakshi

షిర్డీ: అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈసీ ఆన్‌లైన్‌ సిస్టమ్‌ ద్వారా ఓ గుర్తుతెలియని వ్యక్తి అసాధారణ రీతిలో షిర్డీ సాయిబాబా పేరును స్ధానిక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించాడు. ఆన్‌లైన్‌ ఫామ్స్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో దీన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సాయిబాబా చిరునామాగా షిర్డీ ఆలయాన్ని పేర్కొన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

ఐటీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిబాబా పేరును ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఫామ్‌ నెంబర్‌ 6ను నింపడం ద్వారా ఓ వ్యక్తి ప్రయత్నించాడని, ఫాంలను పరిశీలిస్తుండగా ఈ విషయం వెలుగుచూసిందని అధకారులు తెలిపారు. ఈ కేసును తొలుత అహ్మద్‌నగర్‌ జిల్లా సైబర్‌క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించిన పోలీసులు రహతా పోలీసులకు తిరిగి బదలాయించడంతో దర్యాప్తులో జాప్యం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

2017 డిసెంబర్‌ 4న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. షిర్డీ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి సాయిబాబాను ఓటర్‌గా నమోదు చేయించేందుకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ సిస్టమ్‌ను ఆశ్రయించిన వ్యక్తి సాయిబాబా వయసు 24 సంవత్సరాలుగా పేర్కొన్నాడని, తండ్రి పేరు రామ్‌గా ఉటంకించాడని, చిరునామాగా షిర్డీ ఆలయాన్ని ప్రస్తావించాడని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement