Sakshi News home page

మరాఠీలకు ఉద్ధవ్ థాక్రే క్షమాపణలు...

Published Sat, Oct 1 2016 7:15 PM

మరాఠీలకు ఉద్ధవ్ థాక్రే క్షమాపణలు...

ముంబైః మరాఠా నిశ్శబ్ద నిరసనకారులను వెక్కిరిస్తూ సామ్నా పత్రిక ప్రచురించిన కార్టూన్ పై శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే క్షమాపణ చెప్పారు. తాము ప్రచురించిన కార్టూన్ ఎవరినైనా బాధించిఉంటే అందుకు తాను విచారిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 'నిశ్శబ్ద మార్చ్' పేరుతో ప్రచురించిన కార్టూన్ వల్ల మరాఠాలను కించపరిచినట్లు భావిస్తే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు.

మరాఠా కమ్యూనిటీని ఉద్దేశపూర్వకంగానే కించపరిచారంటూ శివసేన పత్రిక  'సామ్నా' ప్రచురించిన కార్టూన్ పై ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరాఠాలకు థాకరే ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పారు. సామ్నా పత్రికలో గత ఆదివారం వచ్చిన కార్టూన్ కు  నిరసనగా కొందరు కార్యాలయంపై రాళ్ళ దాడి కూడా చేశారు. అనంతరం దాడికి పాల్పడింది తామే అంటూ మరాఠా సామాజిక సంస్థ శంభాజీ బ్రిగేడ్ ప్రకటించింది. సామ్నాలో కార్టూన్ ను ప్రచురించడాన్ని శాంభాజీ బ్రిగేడ్ ప్రతినిధి శివానంద్ భోంజే ఖండించారు. ఈ అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సహా సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ రౌత్, కార్టూనిస్టు మహరాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరాఠాల భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో భాగంగానే యాదృచ్ఛిక దాడి జరిగిందని శివానంద్ వివరించారు. మరోవైపు వివాదాస్పద కార్టూన్ ప్రచురణపై పలు రాజకీయ పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి.

సామ్నా పత్రిక వ్యంగ్యంగా చిత్రీకరించిన కార్టూన్.. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్ యూ) విద్యార్థులను, సైనికులను సైతం వెక్కిరిస్తున్నట్లుగా ఉందని సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. శివసేన పత్రిక ప్రజల వాక్ స్వాతంత్ర్యానికి అడ్డు పడుతూ..  అనారోగ్య హాస్యాన్ని పలికిస్తూ ప్రజల్ని కించపరిచేట్లుగా వ్యవహరిస్తోందని పలువురు దుయ్యబట్టారు. గతనెల్లో అహ్మద్ నగర్ లో ఓ మరాఠా మైనర్ బాలికపై జరిగిన క్రూరమైన గ్యాంగ్ రేప్, హత్య ఘటన తర్వాత మరాఠా కమ్యూనిటీ సభ్యులు చేపట్టిన నిశ్శబ్ద నిరసనకు మహరాష్ట్ర ప్రభుత్వం సైతం గడగడలాడింది.

Advertisement
Advertisement