‘పొత్తు’కు పదవులే అడ్డు..! | Sakshi
Sakshi News home page

‘పొత్తు’కు పదవులే అడ్డు..!

Published Sun, Nov 2 2014 12:10 AM

‘పొత్తు’కు పదవులే అడ్డు..! - Sakshi

* బీజేపీ, శివసేన మధ్య కొనసాగుతున్న చర్చలు
* డిప్యూటీ సీఎంతోపాటు 10 మంత్రి పదవులపై పట్టుపడుతున్న శివసేన

* 8 మంత్రి పదవులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న బీజేపీ
* డిప్యూటీ సీఎం పదవి దగ్గరే ఆగిపోయిన సంప్రదింపులు

సాక్షి, ముంబై: బీజేపీతో చేతులు కలిపేందుకు శివసేన సుముఖంగా ఉన్నప్పటికీ ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం 10 మంత్రి పదవులు ఇవ్వాలనిడిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై బీజేపీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి మాత్రం శివసేనను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శివసేన నాయకులతో బీజేపీ నాయకులు శనివారం కూడా ఈ విషయంపై చర్చలు జరిపినట్టు తెలిసింది. అందిన వివరాల మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ టీమ్‌లో మొత్తం 32 మంది మంత్రులుండనున్నారు.

వీరిలో ఉపముఖ్యమంత్రితోపాటు 12 మంత్రి పదవులను శివసేన కోరుతోంది. అయితే ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పదవి విషయంపై బీజేపీ, శివసేన చర్చలు ముందుకువెళ్లడంలేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం 20 మంత్రి పదవులు తమ వద్ద ఉంచుకుని ఎనిమిది మంత్రి పదవులు శివసేనకు, మిగతావి మిత్ర పక్షాలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా మాట్లాడేందుకు ఎవరు ముందుకురాక పోయినప్పటికీ రాష్ట్రంలో మరోసారి శివసేన, బీజేపీలు కలిసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల విషయంపై దూరమైన మిత్రులు ఎన్నికల ఫలితాల అనంతరం తమ వైఖరిని మార్చుకున్నారు. ముఖ్యంగా బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంలో శివసేన మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు శివసేనకు కూడా బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో సీట్ల పంపకాల కారణంగా విడిపోయిన శివసేన, బీజేపీలు మంత్రి పదవుల పంపకాలపై సానుకూలంగా వ్యవహరించి ఇద్దరు మళ్లీ ఒక్కటవుతారని పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement