ముఖ్యమంత్రితో బాబాయ్‌ మంతనాలు | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రితో బాబాయ్‌ మంతనాలు

Published Wed, Apr 5 2017 4:32 PM

ముఖ్యమంత్రితో బాబాయ్‌ మంతనాలు - Sakshi

లక్నో :  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, రాజకీయ సమీకరణలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా  సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం హాట్‌ టాఫిక్‌గా మారింది. సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్య  భేటీ కొనసాగింది. . ముఖ్యమంత్రి నివాసంలో జశ్వంత్‌నగర్‌ ఎమ్మెల్యే అయిన శివపాల్‌యాదవ్‌ మర్యాద పూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.

అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమే అని చెబుతున్నా, శివపాల్‌ ...సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలవడం కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పటికే ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కొడుకు ప్రతీక్‌ యాదవ్‌, ఆయన భార్య అపర్ణ యాదవ్‌ పలుమార్లు యోగి ఆదిత్యనాథ్‌తో కలిసిన విషయం తెలిసిందే. త్వరలో అపర్ణయాదవ్‌ కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు శివపాల్‌ కూడా సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ములాయం కుటుంబసభ్యులు కమలానికి చేరువ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

కాగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ.. అబ్బాయ్‌ అఖిలేష్, బాబాయ్‌ శివపాల్‌ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్‌ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్‌ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావలనుకున్న అఖిలేష్‌కు బీజేపీ గట్టి షాక్‌ ఇచ్చింది. దీంతో 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఎస్పీ ఓటమితో ములాయంతో పాటు శివపాల్‌ కూడా అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement