స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..! | Sakshi
Sakshi News home page

స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..!

Published Mon, Jul 4 2016 11:24 AM

స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..! - Sakshi

న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి   ఇరానీపై విదేశీ మీడియా విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఆమె ఓ పవర్ ఫుల్ మంత్రే కాదు వివాదాల మహరాణి అంటూ ఛలోక్తులు విసిరింది. మీలో ఏ లక్షణాలను గుర్తించి మీకు ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవిని ఇచ్చారన్న ఓ టెలివిజన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు.. మరోసారి వివాదాన్ని తెచ్చిపెట్టింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా స్టూడియోలో ప్రేక్షకుల ముందు ఆమె అదే ప్రశ్నను పునరావృతం చేసి అక్కడివారిని రెచ్చగొట్టిన తీరుపై ఫారెన్ మీడియా మండి పడుతోంది.

ఇప్పటికే నకిలీ డిగ్రీ  ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి స్మతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శలు ఎక్కుపెట్టింది. ఓ టీవీ  స్టూడియోలో ఆమె ప్రవర్తించిన తీరును తప్పుపడుతోంది. టీవీ స్టూడియోలో స్మృతిని పాత్రికేయుడు అడిగిన ప్రశ్ననే... ఆమె రిపీట్ చేసి.. అక్కడున్న వారిని రెచ్చగొట్టడంతో వారంతా సదరు జర్నలిస్టుపైకి దూసుకొచ్చి.. దాదాపు కొట్టినంత పనిచేసిన నేపథ్యంలో విదేశీ మీడియా విరుచుకుపడుతోంది. మీలో ఎటువంటి లక్షణాలను గుర్తించి మీకు మంత్రి పదవి ఇచ్చారంటూ సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెలో ఆగ్రహాన్ని తెప్పించిందో.. లేదా ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆలా ప్రవర్తించిందో తెలియదు గానీ... అతడు అడిగిన ప్రశ్ననే స్టూడియోలోని ప్రేక్షకులముందు రిపీట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన అక్కడి జనం.. కుర్చీలపైనుంచి దూకి.. వేదికపైకి దూసుకొచ్చిన పాత్రికేయుడ్ని కొట్టినంత పని చేశారు. అయితే అంతటి వ్యతిరేకత వస్తుందని ఆమె అనుకుందో లేదో గాని... వారి అభిమానానికి ఓ పక్క ఆనందించినా పరిస్థితులు అదుపు తప్పడంతో స్టేజిపైకి వచ్చిన వారిని వారించి, సదరు జర్నలిస్టును కొట్టకుండా కాపాడింది.

ప్రముఖ రాజకీయ నాయకురాలు, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మానవవనరుల శాఖామంత్రిగా కొనసాగుతున్న 40 ఏళ్ళ స్మృతి ఇరానీ.. తన విద్యార్హతల విషయంలో ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాత టీవీ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులూ అందుకున్న ఆమె... రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకొన్నారు. దీనికి తోడు ఎప్పుడూ తన పదునైన ప్రసంగాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం కూడ ఆమెలోని మరో ప్రత్యేకతగా చెప్పాలి. లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్రమంత్రి... ఎన్నికల కమిషన్ కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలు ఒక్కోదాంట్లో ఒక్కో విధంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను మంత్రి పదవినుంచీ తొలగించాలన్న డిమాండ్లుకూడ వెల్లువెత్తాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన  సుమారు 42 విశ్వవిద్యాలయాలకు చెందిన అధిపతుల సమావేశంలోనూ స్మృతి ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఆమెను ఫోటో తీయాలని చూసిన ఓ ప్రొఫెసర్ ను దురుసుగా తోసేయడంకూడ పెద్ద దుమారమే రేపింది. అయితే ఆమె అజ్ఞానం, అహంకారం కలసి ప్రమాదకరంగా మారుతున్నాయంటూ అప్పట్లో రామచంద్ర గుహ అనే ఓ రాజకీయ చరిత్రకారుడు సైతం విమర్శించడం విశేషం. ఏదై ఏమైనా స్మృతి ఇరానీ ఇప్పుడు విదేశీ మీడియా దృష్టిలో పడి మరోసారి వివాదాలు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement