అంతర్రాష్ట్ర మండలి నుంచి స్మృతీ ఔట్‌ | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర మండలి నుంచి స్మృతీ ఔట్‌

Published Thu, Oct 20 2016 12:56 PM

అంతర్రాష్ట్ర మండలి నుంచి స్మృతీ ఔట్‌

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం పనిచేసే అంతర్రాష్ట్ర మండలి నుంచి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, సదానంద గౌడలను తప్పించారు. ప్రధాని మోదీ అధ్యక్షులుగా ఉన్న ఈ మండలిలో కొత్తగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను సభ్యునిగా తీసుకున్నారు. మండలిలో మార్పులుచేర్పులు జరిగాయని తాజాగా విడుదలైన ఓ ఉత్తర్వు ద్వారా తెలుస్తోంది.

మండలి స్టాండింగ్‌ కమిటీలో ఎలాంటి మార్పులు లేవు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇకమీదట కూడా మండలిలో కొనసాగనున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారం చూపేందుకు 1990 మేలో ప్రధాని అధ్యక్షతన అంతరాష్ట్ర మండలిని ఏర్పాటుచేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని ఈ జులైలో మండలి 11వ సమావేశం జరిగింది.

ప్రస్తుత మండలిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్‌ గడ్కరీ, మనోహర్‌ పరీకర్‌ సభ్యులుగా ఉన్నారు. వీరుగాక మరో పదిమంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

Advertisement
Advertisement