50 కోట్ల మందికి సామాజిక భద్రత | Sakshi
Sakshi News home page

50 కోట్ల మందికి సామాజిక భద్రత

Published Thu, Jun 28 2018 12:57 AM

Social security cover extended to 50 crore people - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 కోట్ల మందికి సామాజిక భద్రత పథకాల లబ్ధి చేకూరుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014లో ఈ పథకాల లబ్ధిదారుల సంఖ్య కేవలం 4.8 కోట్లుగానే ఉందని, నాలుగేళ్ళలో 10 రెట్లు పెరిగిందన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో బుధవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘సామాజిక భద్రత పథకాలు ప్రజలు తమ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు బలాన్ని, ధైర్యాన్నిస్తాయి. ప్రధాన మంత్రి జీవన్‌ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ సురక్ష యోజన, అటల్‌ పింఛను యోజన, ప్రధాన మంత్రి వ్యయ వందన యోజన వంటి పథకాల ద్వారా నేడు దేశంలోకి కోట్లాది మందికి ఈ బలం, ధైర్యం వచ్చాయి’ అని మోదీ అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లాగా భారత్‌లో సామాజిక భద్రత పథకాలు పేదలకు అందడం లేదనే చర్చ జరిగేదని.. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. పీఎం జన్‌ధన్‌ యోజనతో జీవిత బీమా, రూపే కార్డుతో ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. వీటికి తోడు రెండు బీమా పథకాలు, ఒక పింఛను పథకాన్ని ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. వీటన్నిటి ఫలితంగానే.. 2014లో 4.8 కోట్లుగా ఉన్న సామాజిక భద్రత పథకాల లబ్ధిదారుల సంఖ్య పదిరెట్లు పెరిగి 50 కోట్లకు చేరిందన్నారు. పీఎం జన్‌ధన్‌ యోజనలో భాగంగా దేశంలో 2014–2017 మధ్యలో 28 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు.  

నేడు ఉత్తరప్రదేశ్‌కు మోదీ
ప్రధాని మోదీ గురువారం ఉత్తరప్రదేశ్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కబీర్‌ దాస్‌ 500వ వర్ధంతిని పురస్కరించుకుని మఘర్‌లో ‘కబీర్‌ అకాడెమీ’కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా కబీర్‌ దాస్‌ బోధనలు, తత్వాన్ని ప్రసారం చేయనున్నారు. అనంతరం మఘర్‌లో ఏర్పాటుచేయనున్న బహిరంగసభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం యోగి సమీక్షిస్తున్నారు.  

మోదీ మౌలిక ప్రాజెక్టుల సమీక్ష
వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రైల్వే, రోడ్డు, విద్యుత్‌ రంగ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్షించారు. 4కోట్ల కుటుంబాలకు విద్యుత్‌ అందజేసే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ప్రాజెక్టుల పనితీరును సమీక్షించారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకోసం ఉద్దేశించిన పథకం అమలుపైనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. 40వేల గ్రామాల్లో (వెనుకబడిన జిల్లాల్లోని) జరుగుతున్న రెండో విడత గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆగస్టు 15 నాటికి ఈ జిల్లాల్లోని పనులన్నీ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని భద్రతపై సమీక్ష సాధారణమే!
ప్రధాన మంత్రి సహా దేశంలో వీవీఐపీల భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడం సాధారణంగా జరిగే ప్రక్రియేనని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రధానికి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆయన భద్రతపై మంగళవారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement