ఎన్ఎస్జీ కమాండో చెల్లెలు ఐసిస్లో చేరిక? | Sakshi
Sakshi News home page

ఎన్ఎస్జీ కమాండో చెల్లెలు ఐసిస్లో చేరిక?

Published Mon, Jul 11 2016 4:25 PM

ఎన్ఎస్జీ కమాండో చెల్లెలు ఐసిస్లో చేరిక? - Sakshi

ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్లలో ఒకరు దేశం కోసం పోరాడుతుంటే.. మరొకరు దేశం మీద పోరాటం కోసం ఉగ్రవాద సంస్థకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కేరళలోని రెండు జిల్లాల నుంచి దాదాపు 20 మందికి పైగా యువతీ యువకులు ఇటీవల అదృశ్యం అయిన విషయం తెలిసిందే. వాళ్లంతా ఐఎస్లో చేరడానికి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. వారిలో బిందుకుమార్ కుమార్తె ఒకరు. తన కుమార్తెకు వచ్చే నెలతో 24 ఏళ్లు నిండుతాయని, ఆమెను వెతకడంలో దేవుడే దిక్కని బిందుకుమార్ అన్నారు. ఆమె కొడుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)లో కమాండోగా పనిచేస్తున్నారు. తాను కూడా ఆర్మీలో చేరుతానని తన కూతురు నిమిష చెబుతూ ఉండేదని, ఎప్పుడూ సరదాగా ఉండే ఆమె.. ఇలా అవుతుందని ఊహించలేదని ఆమె వాపోయారు.

కేరళ నుంచి వెళ్లిపోయిన 20 మందిలో ఇద్దరు మాత్రం తమ బంధువులకు మెసేజిలు పంపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తే.. అఫ్ఘానిస్థాన్, ఈజిప్టుల నుంచి అని తేలింది. తన పిల్లలిద్దరికీ దైవభక్తితో పాటు దేశభక్తి కూడా బాగా ఉందని ఆమె చెప్పారు. ఆమె భర్త కేరళలో చిన్న రెస్టారెంటు నడిపిస్తుంటారు. జూన్ 3వ తేదీన వాళ్లకు తమ కూతురి నుంచి చివరి మెసేజ్ వచ్చింది. తర్వాతిరోజు ఆమెకు ఫోన్ చేస్తే, అది స్విచాఫ్ చేసి ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ ఆమె ఫోన్ కలవలేదు. గత నవంబర్ నుంచి ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసింది. ఎందుకని ఆమె బీడీఎస్ చదువుతున్న కాలేజికి వెళ్లి కనుక్కుంటే.. పెళ్లి కోసం ఆమె ఇస్లాం మతంలోకి మారిందని తెలిసింది. అది వాళ్లకు పెద్ద షాక్. ఎజా అనే ఎంబీయే కుర్రాడిని పెళ్లి చేసుకోడానికి ఆమె ఫాతిమా అని పేరు మార్చుకుంది. అంతలోనే ఏమైందో తెలియదని.. తన కూతురు ఐఎస్లో చేరిందని అంటున్నారని బిందు కుమారి వాపోతున్నారు.

Advertisement
Advertisement