పొడవని పొత్తు? | Sakshi
Sakshi News home page

పొడవని పొత్తు?

Published Sun, Jan 22 2017 1:43 AM

పొడవని పొత్తు? - Sakshi

ఎస్పీ–కాంగ్రెస్‌ల మధ్య కుదరని సయోధ్య
99 సీట్లు ఇస్తామన్న ఎస్పీ.. 120కి తగ్గేది లేదన్న కాంగ్రెస్‌.. అఖిలేశ్‌కు సోనియా ఫోన్‌


లక్నో, న్యూఢిల్లీ: యూపీలో ఆదిలోనే మహాకూటమి ఏర్పాటుకు బ్రేక్‌ పడగా... తాజాగా ఎస్పీ–కాంగ్రెస్‌ల మధ్య పొత్తుపై ప్రతిష్టంభన వీడలేదు. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తుకు తహతహలాడిన అఖిలేశ్‌ 99 సీట్లు ఇస్తామన్నా... కాంగ్రెస్‌ మరిన్ని సీట్లకు పట్టుబట్టడంతో సయోధ్యపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 85 సీట్లకు మించి ఇచ్చేది లేదంటూ శుక్రవారం స్పష్టం చేసిన ఎస్పీ... శనివారం దిగివచ్చి మరో 14 సీట్లకు ఓకే చెప్పింది. 150 స్థానాలు ఇవ్వాలంటూ మొదట్లో డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌... చివరకు 120 స్థానాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేసింది. సీట్ల సంఖ్యపై తగ్గేది లేదని చెపుతూ... మొదటి రెండు దశలకు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసేసింది.

శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ 210 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఉలిక్కిపడింది. ఎస్పీ జాబితాలో కాంగ్రెస్‌కు చెందిన 8 సిట్టింగ్‌ స్థానాలు సహా గాంధీల కంచుకోటలు అమేథీ, రాయ్‌బరేలీ పరిధిలోని స్థానాలు ఉండడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. దీంతో ప్రియాంక గాంధీ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా యూపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ రంగంలోకి దిగారు. ఎస్పీతో పొత్తు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాంగ్రెస్‌ డిమాండ్లకు తలొగ్గేది లేదంటూ సమాజ్‌వాదీ కూడా స్పష్టం చేసింది. పొత్తు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఎస్పీ ఎంపీ నరేష్‌ అగర్వాల్‌ తేల్చి చెప్పారు. ‘పొత్తు దాదాపు ముగిసినట్లే. కాంగ్రెస్‌కు యూపీ సీఎం 100 సీట్ల వరకూ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ మాత్రం 120 సీట్లు ఇస్తేనే ఒప్పుకోవాలనే ఆలోచనలో ఉంది’ అని చెప్పారు.

మేం కూడా తగ్గేది లేదు.. కాంగ్రెస్‌: పొత్తుపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం కోసం వేచి ఉండకుండా ఎస్పీ అభ్యర్థుల్ని ప్రకటించేసిందని, ఆ పార్టీ నాయకత్వం రాజీ ధోరణితో వ్యహరించడం లేదనేది కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నిక కమిటీ శనివారం సమావేశమై మొదటి రెండు దశల్లో 140 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తాము కూడా పట్టువీడేది లేదంటూ ఎస్పీకి పరోక్ష సంక్షేతాలు పంపింది. ఎస్పీతో పొత్తు ముగిసినట్లేనా అని ఆజాద్‌ను ప్రశ్నించగా.. ‘వేచి చూడండి. ఆదివారం ఉదయం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఆదివారం సమాజ్‌వాదీ మేనిఫెస్టోను అఖిలేశ్‌ యాదవ్‌ విడుదల చేయనున్నారు. ఎస్పీ–కాంగ్రెస్‌లు కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టో విడుదల చేస్తారని భావించినా... కూటమిపై సందిగ్ధతతో ఎస్పీ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. సీట్ల పంపకంపై సందిగ్ధత నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో ఫోన్‌లో ఆమె మాట్లాడారు.
 
ప్రచారకుల జాబితాలో అడ్వాణీకి దక్కని చోటు
యూపీ తొలి, రెండో విడత ఎన్నికల్లో పార్టీ ముఖ్య ప్రచారకుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. జాబితాలో బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ, ఎంపీ వరుణ్‌ గాంధీ, యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు వినయ్‌ కటియార్‌ పేర్లు లేకపోవడం గమనార్హం. ప్రధానిమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, రాజ్‌నాథ్, ఉమా భారతి, సంజీవ్‌ బల్యన్, కల్రాజ్‌ మిశ్రా, మేనకా గాంధీలు పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు.

Advertisement
Advertisement