పోరు నష్టం.. పొత్తు లాభం! | Sakshi
Sakshi News home page

పోరు నష్టం.. పొత్తు లాభం!

Published Wed, Jan 18 2017 3:37 AM

పోరు నష్టం..  పొత్తు లాభం! - Sakshi

కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేశ్‌ వ్యూహం
పొత్తుల విషయంలో అఖిలేశ్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎస్పీ–కాంగ్రెస్‌–ఆర్‌ఎల్‌డీల మహాకూటమిని నిలపాలనేది ఆయన ఆలోచన. తద్వారా ముస్లిం ఓట్లలో చీలికను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. యూపీ జనాభాలో 9 శాతంగా ఉన్న యాదవులు, 19 శాతంగా ఉన్న ముస్లింలు ఎస్పీకి సంప్రదాయ ఓటు బ్యాంకు. 2012లో 11.65 శాతం ఓట్లు (28 సీట్లు) సాధించిన కాంగ్రెస్, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లు పొందింది. కాంగ్రెస్‌కు ప్రతి నియోజకవర్గంలో పడుతున్న దాదాపు 5 వేల ఓట్లు ఎస్పీకి బదిలీ అయితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని అఖిలేశ్‌ శిబిరం అంచనా.

ముస్లిం ఓట్ల కోసం: కాంగ్రెస్‌కు 2012లో 18%, 2014లో 11% ముస్లిం ఓట్లు పడ్డాయి. ఎస్పీకి 2012లో 39%, 2014లో బీజేపీపై వ్యతిరేకతతో 58% ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పొత్తుతో ముస్లిం ఓట్లూ దక్కుతాయని అఖిలేశ్‌ లెక్క. బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా కనపడితే ముస్లింలు బీఎస్పీ వైపు వెళ్లరని అంచనా.

జాట్ల కోసం గాలం: రాష్ట్ర జనాభాలో జాట్లు 1.7%. జాట్ల పార్టీగా పరిగణించే ఆర్‌ఎల్‌డీనీ కూటమిలోకి తేవాలనేది అఖిలేశ్‌ వ్యూహం. 2012లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఆర్‌ఎల్‌డీ 46 స్థానాల్లో పోటీచేసి 9 చోట్ల గెలిచింది. 2.3 శాతం ఓట్లు సాధించింది. పశ్చిమ యూపీలో 50 స్థానాల్లో ప్రభావం చూపగల జాట్ల ఓట్ల కోసం కూటమి తరఫున ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్‌ కుమారుడు జయంత్‌ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలూ ఉన్నాయని పరిశీలకుల అంచనా. తమను ఓబీసీల్లో చేర్చకపోవడం వంటి కారణాలతో జాట్లు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. చిన్నపార్టీలు ఓట్లు చీల్చకుండా త్రిముఖ పోరు ఉండేలా(ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ) అఖిలేశ్‌ యత్నిస్తున్నారు.

కాంగ్రెస్‌కు 75–80 సీట్లు, ఆర్‌ఎల్‌డీ, ఇతర చిన్నాచితకా పార్టీలకు కలిపి 25 సీట్ల వరకు వదులుకోవడానికి ఎస్పీ సిద్ధంగా ఉంది. మరోపక్క.. ఎస్పీ కలహాలతో విసిగిన ముస్లింలు తమవైపు మొగ్గుతారనే ఆశతో ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఎస్పీ–కాంగ్రెస్‌ పొత్తు ఆశనిపాతమే. ముస్లిం ఓట్లపై భారీ అంచనాలతో ఆమె ఏకంగా 97 మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. ముస్లిం ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య ఎంతగా చీలిపోతే అంత లాభమనేది బీజేపీ లెక్క. బీజేపీని మహాకూటమి నిలువరించగలదంటూ ముస్లింలు దానివైపు మొగ్గితే బీజేపీ లెక్కలూ తప్పుతాయి.  –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement