స్టాచ్యూ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా.. | Sakshi
Sakshi News home page

స్టాచ్యూ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా..

Published Sun, Jul 16 2017 1:08 AM

స్టాచ్యూ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా..

చెన్నైలోని ఓ ప్రైవేటు బీచ్‌ రిసార్టుకు రోజూ వందల సంఖ్య లో సందర్శకులు వస్తుంటారు. ఆ రిసార్టులో పర్యాటకుల్ని ఆకర్షించే ప్రత్యేకతలు ఎన్నో ఉన్నా అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షించేది మాత్రం ఓ వ్యక్తి. ఇంతకీ అతనేం చేస్తాడో తెలుసా.. కదలకుండా ఆరు గంటల పాటు ఓ విగ్రహంలా నిలబడి ఉంటాడు. సందర్శకుల్ని ఆకర్షించేందుకు రిసార్టు యాజమాన్యం ఈ ఏర్పాటు చేసింది. అతడి పేరు అబ్దుల్‌ అజీజ్‌. 54 ఏళ్ల వయసున్న అజీజ్‌ ఈ రిసార్టులో 1985 నుంచి ఇదే పనిలో ఉన్నాడు. ఒక వ్యక్తి  32 ఏళ్లుగా రోజూ ఆరు గంటలపాటు శిల్పంలా నిలబడి ఉండటం సాధారణ విషయం కాదు. కానీ, అజీజ్‌ దీన్ని ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.

అందువల్లే అతడిని ‘స్టాచ్యూ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి కళాకారులు చాలా మందే ఉన్నారు. కానీ ఇంత ఎక్కువ కాలం పాటు విగ్రహంలా నిలబడి ఉంటున్న వ్యక్తి ఇతడే అయ్యుం డొచ్చు. రాచరిక కాలం నాటి దుస్తులు ధరించి, ఒక్కసారి అలా నిలబడటం ప్రారంభమైందంటే, సమయం పూర్తయ్యే వరకూ ఎటూ కదిలే అవకాశం ఉండదు. తనకిష్టం లేకపోయినా కుటుంబ పోషణ కోసం ఈ పని చెయ్యక తప్పడం లేదని అజీజ్‌ చెబుతాడు. ఇక శిల్పంలా నిలబడ్డ ఇతడ్ని కదిలించి, నవ్విం చేందుకు చాలా మంది సందర్శకులు కవ్విస్తూనే ఉంటారు. పొట్టచెక్కలయ్యేలా జోకులూ పేలుస్తుంటారు. కానీ అజీజ్‌ బాడీలో ఎక్కడా కదలిక ఉండదు. అంతగా ఈ పనికి అలవాటు పడిపోయాడు. అజీజ్‌ కదిలించినా, నవ్వించినా నగదు బహుమతినిస్తామని రిసార్టు యాజమాన్యం ప్రకటించింది. ఇంతవరకు ఏ సందర్శకుడూ ఆ బహుమతి గెలుచుకోలేకపోయాడు! 

Advertisement
Advertisement