క్షమాపణ కోసం అడుక్కుంటోంది | Sakshi
Sakshi News home page

క్షమాపణ కోసం అడుక్కుంటోంది

Published Tue, Dec 29 2015 2:08 AM

క్షమాపణ కోసం అడుక్కుంటోంది - Sakshi

♦ బీజేపీ డిమాండ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
♦ ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదన్న ఢిల్లీ ప్రభుత్వం
♦ డీడీసీఏపై సీబీఐ, ఈడీ విచారణకు కీర్తి ఆజాద్ డిమాండ్
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, అందువల్ల తాను జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జైట్లీపై ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని, అందువల్లే ఆయనపై ఆరోపణలు చేసినందుకు కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదివారం బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. బీజేపీ క్షమాపణల కోసం తనను అడుక్కునే పరిస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. పరువు నష్టం కేసు దాఖలు చేసిన జైట్లీ క్రాస్ ఎగ్జామిన్‌ను ఎదుర్కోవాలని చెప్పారు. డీడీసీఏలో పలు అవకతవకలు జరిగినట్టు కమిషన్ నిర్ధారించిందని, అయితే దీనికి ఎవరినీ బాధ్యులుగా గుర్తించలేదని స్పష్టం చేశారు.

 ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు: ఢిల్లీ ప్రభుత్వం
 తాము ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ జైట్లీకి క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ బీజేపీ ప్రకటించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తప్పుపట్టింది. డీడీసీఏపై దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా  అన్నారు. జైట్లీ హయాంలో అక్రమాలు జరగనట్లయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీని ప్రశ్నించారు. విచారణ కమిషన్ ఎవరి పేర్లను ప్రస్తావించలేదని, కానీ అవకతవకలు జరిగినట్టు గుర్తించిందని, అంటే దెయ్యాలు వచ్చి అవినీతికి పాల్పడ్డాయా? అని ఎద్దేవా చేశారు. జైట్లీని తప్పించేందుకు ఎందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.

 విచారణ ప్రక్రియ లైవ్ టెలికాస్ట్ చేయాలి: సుబ్రహ్మణియమ్
 కాగా, డీడీసీఏ విచారణ ప్రక్రియను లైవ్‌టెలికాస్ట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియమ్ కోరారు. దీనివల్ల విచారణ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని అంటున్నారు. బహిరంగ విచారణ జరపుతామని తాము ముందే చెప్పామని, విచారణ ఎలా సాగుతుందనే విషయాన్ని ప్రపంచంలో ఎక్కడివారైనా సరే చూసేలా టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. మరోవైపు డీడీసీఏ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్లతో విచారణ జరిపించాలని బీజేపీ నుంచి సస్పెండెడ్ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. తాను అరుణ్‌జైట్లీని మాత్రమే టార్గెట్ చేసుకోవడం లేదని, డీడీసీఏ డెరైక్టర్లుగా ఉన్న కాంగ్రెస్ నేతలు రాజీవ్‌శుక్లా, నవీన్ జిందాల్, అర్వీందర్‌సింగ్ లవ్‌లీ తదితరులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Advertisement
Advertisement