Sakshi News home page

మావోలపై విరుచుకుపడండి: కేంద్రం

Published Fri, Apr 28 2017 2:20 AM

మావోలపై విరుచుకుపడండి: కేంద్రం - Sakshi

న్యూఢిల్లీ: మావోల చేతిలో 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు బలైన నేపథ్యంలో మావోలపై పూర్తిస్థాయిలో దాడులకు సిద్ధం కావాలని భద్రతా బలగాలను కేంద్రం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని వారాల్లోనే తమకు ఫలితాలు కావాలని కేంద్రం కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సీఆర్పీఎఫ్‌ తాత్కాలిక డైరెక్టర్‌ జనరల్‌ సుదీప్‌ లక్టాకియా గురువారం మీడియాతో మాట్లాడుతూ, మావోలపై పోరాటంలో తమ వ్యూహాలను పునఃసమీక్షించుకుంటామని తెలిపారు. తమ బలగాల్లో సగం రోడ్డు నిర్మాణాలకు రక్షణగా ఉంటే, మిగతా సగం మావో వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటారని లక్టాకియా స్పష్టం చేశారు. మావోలపై దాడికి సరిక్తొత వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు.

కశ్మీరే బెటర్‌ అంటున్నారు: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రఒత్తిడి మధ్య పనిచేయడం కంటే కశ్మీర్‌ సహా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొనడానికే చాలామంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మొగ్గుచూపుతున్నారని హోంశాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో చాలామంది జవాన్లు మూడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు సుదీర్ఘకాలం ఒకేచోట పనిచేయడం వల్ల బలగాలు అలసిపోతున్నాయన్నారు. ఈ ఏడాది 32 మంది నక్సల్స్‌ చనిపోగా, 38 సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారని వారు చెప్పారు.

Advertisement
Advertisement