చదువుతూనే దొంగతనాలు | Sakshi
Sakshi News home page

చదువుతూనే దొంగతనాలు

Published Sat, Jul 26 2014 12:33 AM

చదువుతూనే దొంగతనాలు - Sakshi

వారు ముగ్గురూ స్నేహితులు. బాగా చదువుకున్న వారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి పేరుప్రతిష్టలు తెస్తారని తల్లిదండ్రులు ఆశించారు. అయితే వారి ఆశలను అడియాశలు చేశారు. జల్సాలకు అలవాటుపడి దొంగలు, దోపిడీదారులుగా మారిపోయారు. కన్నవారికి పుత్రశోకాన్నిమిగిల్చారు.
 
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓ ముగ్గురు మిత్రులు చదువుతూనే దొంగనాలకు అలవాటు పడ్డారు. ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ పోలీసులను బురిడీ కొట్టించారు. వీరిపై నిఘా వేసిన పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకుని కటకటాలకు పంపారు. శుక్రవారం విచారణలు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  
 
చెన్నై కొడంగయ్యూరుకు చెందిన శ్రీనివాసన్, ముగప్పేర్‌కు చెందిన ఎల్.రాయన్ స్నేహితులు. తాంబరంలోని కాలేజీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీనివాసన్‌తో ప్లస్ 2 వరకు చదివిన అభిషేక్ తోడయ్యాడు. వీరు ముగ్గురు ఒక్కటిగా ఉంటూ అన్నిచోట్లకూ కలిసే వెళ్లేవారు. శ్రీనివాసన్ తండ్రి రాజశేఖర్‌ది తిరునెల్వేలి. గతంలో వారి బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. శ్రీనివాసన్ తన ఇద్దరు మిత్రులను తీసుకెళ్లాడు.
 
పెళ్లికి హాజరైన మహిళలంతా భారీ స్థాయిలో నగలు ధరించడం చూశారు. వాటిపై ఎల్లరాయన్ కన్నుపడింది. నగలు కాజేస్తే జీవితాంతం ఉల్లాసంగా గడపవచ్చని తన స్నేహితులకు నూరిపోశాడు. చెన్నై నుంచి రైలులో తిరునెల్వెలీ చేరారు. ముందుగానే సిద్ధం చేసుకున్న మోటార్‌బైక్‌ను రైల్వేస్టాండ్ నుంచి తీసుకుని రోడ్లలో వెళ్లే మహిళల మెడల్లోని బంగారు నగలను దోచుకున్నారు. అదే రోజు రాత్రి లాడ్జీల్లో బసచేసి ఆన్‌లైన్ ద్వారా ఏసీ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుని చెన్నైకి చేరుకుంటారు. ఏడాదిన్నర కాలంలో ఈ విద్యార్థులు 27 దొంగతనాలు చేశారు. నెల్లైలో తరచూ దొంగతనాలు జరగడం, నిందితులు పట్టుపడక పోవడం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.
 
ఇటీవల ఒక మహిళను దోచుకునిపోతూ శ్రీనివాసన్ పట్టుబడడంతో విద్యార్థుల వ్యవహారం బట్టబయలైంది. శ్రీనివాసన్ ఇచ్చిన సమాచారంతో గురువారం చెన్నైకి చేరుకున్న పోలీసులు అభిషేక్‌ను పట్టుకుని వంద సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు నాయకత్వం వహించిన ఎల్లరాయన్ పట్టుబడితే మరో 60 సవర్ల నగలు దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాలేజీ ఎన్నికల్లో విద్యార్థుల సంఘాధ్యక్షునిగా పోటీచేసిన శ్రీనివాసన్ చోరీ సొమ్ముతో పాండిచ్చేరి నుంచి రూ.3 లక్షలతో మద్యం బాటిళ్లు తెప్పించి పంచిపెట్టాడు. మరికొంత సొమ్ముతో చెన్నైలో కాల్‌సెంటర్‌ను స్థాపించి అందమైన అమ్మాయిలను పనిలో చేర్చుకున్నాడు.
 
తమకు అనుకూలంగా వ్యవహరించే అమ్మాయిలకు అధిక జీతాలు చెల్లిస్తూ వారితో విలాసంగా తిరిగేవారు. మహాలక్ష్మి అనే యువతికి ఎల్లరాయన్ లక్షలాది రూపాయలు ఇచ్చేవాడు. పోలీసులు తనకోసం వెదుకుతున్నారని తెలుసుకున్న ఎల్లరాయన్ సదరు మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన మరో విద్యార్థి అభిషేక్ సైతం చెన్నైలో ఉద్యోగావకాశాల సంస్థను స్థాపించి, తన ఆశలను తీర్చినవారికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఎల్లరాయన్ తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ముగప్పేరులో ఖరీదైన బంగ్లా ఉంది. తల్లిదండ్రులు దూరంగా ఉండడం వల్ల విలాసాలకు అలవాటుపడిన ఎల్లరాయన్‌కు అందుకు తగిన ఆదాయం కోసం దోపిడీ బాటపట్టాడు.
 
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి తల్లడిల్లిపోయారు. పరారీలో ఉన్న కుమారుడిని వెతికిపట్టుకుని జైల్లో పెట్టాలని పోలీసులను కోరారు.  అభిషేక్ తల్లిదండ్రులది కన్యాకుమారి జిల్లా. ప్రభుత్వ రవాణాశాఖలో కండక్టర్‌గా పనిచేసి రిైటె రయ్యాడు. దొంగిలించిన నగలను అమ్మే బాధ్యతను అభిషేక్ తీసుకున్నాడు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను బోల్తాకొట్టించాడు. రూ.500లు కట్టి రిజిష్టరు చేసుకుంటే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించేవాడు. ఈ ముగ్గురు విద్యార్థులు తిరునెల్వేలోనే కాదు చెన్నై శివార్లలో సైతం దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Advertisement
Advertisement