‘ది పోస్ట్‌’ను సుప్రీం కోర్టు జడ్జీలు చూడాలి! | Sakshi
Sakshi News home page

‘ది పోస్ట్‌’ను సుప్రీం కోర్టు జడ్జీలు చూడాలి!

Published Wed, Jan 24 2018 5:40 PM

Supreme Court Judges Must Watch 'The Post' Movie Says Critics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని ప్రజల దష్టికి తీసుకరావడం జర్నలిస్టుల డ్యూటీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడే జర్నలిస్టులు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వ మోసాలను బహిర్గతం చేయగలరు’ ఏకంగా 21 ఆస్కార్‌ నామినేషన్లు పొందిన ‘ది పోస్ట్‌’ సినిమాలో ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక తరఫున అమెరికా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలివి.

అమెరికా సుప్రీం కోర్టు చిత్తశుద్ధి చెక్కు చెదరకపోవడం వల్ల అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా, మీడియా స్వేచ్ఛకు అండగా అమెరికా సుప్రీం కోర్టు నిలబడగలిగింది. జడ్జీలు నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండడం వల్లనే సాధ్యమైంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీడియాను ఆడిపోసుకుంటున్న సమయంలో చరిత్రలో మీడియా నిర్వహించిన సముచిత పాత్రను హైలెట్‌ చేస్తూ హాలివుడ్‌ సుప్రసిద్ధ దర్శకుడు స్టీఫెన్‌ స్పీల్‌బెర్గ్‌ ఈ చిత్రాన్ని తీశారు.

మహిళా ప్రాధాన్యత గల ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో మెరిల్‌ స్ట్రీప్‌ నటించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం వియత్నాంపై మూడు దశాబ్దాలపాటు యుద్ధం చేసి చతికిలపడిన అమెరికా ప్రభుత్వం వైఖరేమిటో ‘పెంటగాన్‌ పేపర్స్‌ (అమెరికా సైనిక పత్రాలు)’  వాషింగ్టన్‌ పత్రిక పలు వ్యాసాలను ప్రచురించింది.

వాటిని సహించలేని నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిస్సన్‌ ముందుగా ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికపై ఆంక్షలు విధించడంలో విజయం సాధిస్తారు. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా, కోర్టు ధిక్కార నేరం కింద పత్రిక పబ్లిషర్‌కు, సంపాదకునికి జైలు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక వ్యాసాల ప్రచురణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పత్రిక అమెరికా కోర్టు బోను ఎక్కాల్సివస్తుంది. అప్పుడు మీడియాకు కోర్టు అండగా నిలబడుతుంది.

పెంటగాన్‌ పత్రాలను 1970లో వెలుగులోకి తెచ్చిన వాషింగ్టన్‌ పోస్ట్, ఆ తర్వాత ‘వాటర్‌గేట్‌’ కుంభకోణాన్ని 1974లో వెలుగులోకి తెచ్చి ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ భారత మీడియాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని, భారత సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు జడ్జీలందరూ ‘ది పోస్ట్‌’ సినిమా చూడాల్సిన అవసరం ఉందని సినిమా విమర్శకులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement