చిత్రహింస నివారణకు చట్టం ఎప్పుడు: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

చిత్రహింస నివారణకు చట్టం ఎప్పుడు: సుప్రీంకోర్టు

Published Mon, May 8 2017 3:46 PM

చిత్రహింస నివారణకు చట్టం ఎప్పుడు: సుప్రీంకోర్టు - Sakshi

చిత్రహింస, ఇతర క్రూరమైన, అమానవీయ చర్యల్ని నివారించే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి చేసిన చిత్రహింస వ్యతిరేక తీర్మానాన్ని చట్టంగా రూపొందించడంలో జాప్యంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాన్ని ఇన్నేళ్లుగా పక్కన పెట్టడాన్ని తప్పుపట్టింది. ఐరాస తీర్మానానికి అనుగుణంగా చిత్రహింస వ్యతిరేక చట్టం తేలేకపోయినా... కనీసం ఆ దిశగా ప్రయత్నం చేసుండాల్సిందని పేర్కొంది. ‘చట్టబద్ధతమైన ప్రక్రియకు సమయం పడుతుందని అర్థం చేసుకోగలం. కానీ, ఇప్పటివరకు దీనికి కట్టుబడి ఉన్నామని విశ్వాసం కల్పించే కచ్చితమైన ప్రయత్నం ఎందుకు చేయలేదు? జాతీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఈ అంశం అత్యంత కీలకమైంది’  అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. చట్టం రూపకల్పనకు కొన్ని రాష్ట్రాలను సంప్రదించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీనిపై 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు పెట్టిందని, అప్పటి న్యాయశాఖ మంత్రి, ప్రస్తుత పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ కూడా అందులో కీలకపాత్ర పోషించారని అయినా అది కార్యరూపం దాల్చలేదని ఏజీ బదులిచ్చారు. పాకిస్తాన్‌ సహా 161 దేశాలు ఐరాస తీర్మానానికి ఆమోదముద్ర వేసినా భారత్‌ మాత్రం నేటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ కీలక అంశంపై 1997లోనే సంతకం చేసినా... చట్టం రూపకల్పన ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

Advertisement
Advertisement