‘ఉత్తరాఖండ్’ తీర్పుపై సుప్రీం స్టే | Sakshi
Sakshi News home page

‘ఉత్తరాఖండ్’ తీర్పుపై సుప్రీం స్టే

Published Sat, Apr 23 2016 12:49 AM

‘ఉత్తరాఖండ్’ తీర్పుపై సుప్రీం స్టే - Sakshi

రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత
 
♦ ఈ నెల 27 వరకూ స్టే విధించిన సుప్రీం కోర్టు
♦ 26 నాటికి హైకోర్టు తీర్పు ప్రతులు ఇరు పక్షాలకూ ఇవ్వాలని ఆదేశం
♦ తదుపరి విచారణ వరకూ రాష్ట్రపతి పాలనను తొలగించబోమంటూ కేంద్రం నుంచి హామీ తీసుకున్న వైనం
 
 న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో మరో నాటకీయ మలుపు! రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు ఈ నెల 27 వరకూ స్టే విధించింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. స్టే ఉత్తర్వులు జారీ చేసే ముందుగా.. కేసు తదుపరి విచారణ తేదీ వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం తొలగించబోదంటూ అటార్నీ జనరల్ ముకుల్‌రోహత్గీ హామీని ధర్మాసనం నమోదు చేసుకుంది.

తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.  రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటుచ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ   హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం  శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని జస్టిస్ దీపక్‌మిశ్రా, శివకీర్తిసింగ్‌ల బెంచ్ శుక్రవారం మధ్యాహ్నం కిక్కిరిసిన కోర్టులో విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేలు, ఉత్తరాఖండ్‌లో రద్దయిన ప్రభుత్వ సీఎం హరీశ్‌రావత్, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, కపిల్ సిబల్‌లు వాదనలు వినిపించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలపై ఇరు పక్షాల వారూ ఆవేశంగా వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరారు. ‘తీర్పు ఇంకా అందనందున.. ఒక పక్షం సీఎంగా బాధ్యతలు చేపట్టటానికి సానుకూలంగా ఉంటూ.. మరొక పక్షాన్ని ప్రతికూల పరిస్థితిల్లోకి ఎలా నెట్టేస్తారు?’ అని ప్రశ్నించారు.  హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించటమంటే రాష్ట్రపతి పాలన ప్రకటనను అమలు చేయటమే అవుతుందని రావత్, స్పీకర్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరు పక్షాలు తమ తమ వాదనలపై బలంగా పట్టుబట్టటంతో బెంచ్ స్పందిస్తూ.. తమది రాజ్యాంగ కోర్టు అయినందున తాము సమతుల్య దృష్టితో చూడాల్సి ఉంటుందని పేర్కొంది.

హైకోర్టు తన తీర్పుపై సంతకాలు చేసి,  ప్రతివాదులు అప్పీలు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచి ఉండాల్సింద పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రతులు కేసులో ఇరు పక్షాలకూ వెంటనే అందనందున.. ఈ నెల 27న తదుపరి విచారణ వరకూ ఆ తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 26 కల్లా తీర్పు ప్రతులను ఇరు పక్షాలకు అందించటంతో పాటు సుప్రీంకోర్టుకూ అందుబాటులో ఉంచాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు తీర్పు ప్రతినిఅధికారికంగా అందుకుని పరిశీలిస్తామని.. ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు వెళ్లే అవకాశముందని వివరించింది. రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సుప్రీం స్టే విధించటంతోగురువారం హైకోర్టు తీర్పుతో జరిగిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణ రద్దయింది. మళ్లీ రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది.

 న్యాయవ్యవస్థపై పూర్తివిశ్వాసం: కాంగ్రెస్
 న్యాయవ్వస్థపై తమకు పూర్తి విశ్వాసముందని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా, అక్రమంగా, ఏకపక్షంగా రద్దు చేసిందని, కోర్టు ఎదుట వాస్తవాలను ప్రవేశపెడతామని చెప్పింది. సుప్రీం తాజా ఉత్తర్వులు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించి అక్రమ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకుందని రావత్ అన్నారు.  సుప్రీంకోర్టు స్టే విధించకముందు.. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం అనుమతించాలన్నారు.
 
 రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య: వెంకయ్య
 ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య అని.. గవర్నర్ నివేదిక వచ్చిన తర్వాత శాసనసభను పునరుద్ధరించవచ్చునని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.  తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన తర్వాత.. ఏప్రిల్ 29న బలపరీక్ష నిర్వహించాలనటం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పు ప్రతులు కేంద్రం, గవర్నర్‌లకు అందకుముందే.. రావత్ తనకు తానుగా రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం బాధ్యతలు చేపట్టటం అక్రమమని బీజేపీ ఆరోపించింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని సుప్రీంకోర్టు స్టే నిలిపివేసిందని పేర్కొంది.

Advertisement
Advertisement