లొంగుబాటు మీ ఇష్టారాజ్యం కాదు: హైకోర్టు | Sakshi
Sakshi News home page

లొంగుబాటు మీ ఇష్టారాజ్యం కాదు: హైకోర్టు

Published Wed, Feb 24 2016 8:19 AM

లొంగుబాటు మీ ఇష్టారాజ్యం కాదు: హైకోర్టు - Sakshi

లొంగుబాటు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదని జేఎన్‌యూ విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వాళ్లు కావాలనుకున్న పద్ధతిలో లొంగిపోయేందుకు అనుమతించేది లేదని తెలిపింది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాల్సిందేనని జస్టిస్ ప్రతిభా రాణి తెలిఆపరు. తాము సురక్షితంగా బయటకు వెళ్లేందుకు అనుమతించాలని, తాము అనుకున్న ప్రదేశంలో మాత్రమే లొంగిపోతామని జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పెట్టుకున్న పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, తమను నేరుగా హైకోర్టే జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి తప్ప.. పాటియాలా హౌస్ కోర్టు కాదని అడగడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. రిమాండు ప్రొసీడింగ్స్ అన్నీ విచారణ కోర్టు మాత్రమే జరపాలని, ఈ విషయంలో నిందితుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా చేయడానికి వీలుండదని తెలిపారు.

నిందితులు అరెస్టయిన 24 గంటలలోగా విచారణ కోర్టులో వారిని ప్రవేశపెట్టాలని, అక్కడే వాళ్ల రిమాండు విషయం నిర్ణయం అవుతుందని చెప్పారు. తమ క్లయింట్లకు 'సేఫ్ పాసేజ్' ఇవ్వాలని విద్యార్థుల తరఫున వాదిస్తున్న న్యాయవాది కామిని జైస్వాల్ అడిగినప్పుడు 'మీరు ఏమనుకుంటున్నారు, నేను మీకు సేఫ్ పాసేజి ఇవ్వాలా? ఈ కోర్టు ఎందుకు? పద్ధతి ప్రకారమే వెళ్దాం' అని న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

Advertisement
Advertisement