ఆ జాబితాలో భారత్‌కు మెరుగైన ర్యాంకు | Sakshi
Sakshi News home page

ఆ జాబితాలో భారత్‌కు మెరుగైన ర్యాంకు

Published Thu, Jan 16 2020 4:54 PM

Survey Finds India Among Best Countries To Live - Sakshi

న్యూఢిల్లీ : 2020లో జీవించేందుకు అత్యంత అనువైన దేశాల్లో భారత్‌ టాప్‌ 25లో స్ధానం దక్కించుకుంది. ఈ జాబితాలో 25వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న భారత్‌ 2019లో 27వ స్దానంలో నిలిచింది. వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ యూఎస్‌ సహకారంతో యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ చేపట్టిన ఈ సర్వేలో ఆసియా ప్రాంతంలో భారత్‌ కంటే కేవలం చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా, యూఏఈ వంటి నాలుగు దేశాలే ముందున్నాయి. జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్‌ స్ధానం మెరుగుపడినా దేశంలో చిన్నారులు, మహిళల ఎదుగుదల, వారి పరిస్థితిలో మాత్రం మన దేశం పట్ల సర్వేలో పాల్గొన్న వారి ప్రతిస్పందన నిరాశాజనకంగా ఉండటం గమనార్హం. చిన్నారుల ఎదుగుదలకు అనువైన దేశాల్లో భారత్‌ 59వ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ విభాగంలో సింగపూర్‌ 22వ స్ధానంలో ఉండగా అంతర్గత సమస్యలు ఎదుర్కొనే కెన్యా, ఈజిప్ట్‌ వంటి దేశాలు సైతం భారత్‌ కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి. 2019తో పోలిస్తే ఈ విభాగంలో ఆరు ర్యాంకులు మెరుగుపడటమే భారత్‌కు ఊరట ఇచ్చే అంశం. ఇక మహిళల జీవనానికి అనువైన దేశాల జాబితాలో 2019తో పోలిస్తే ఒక స్ధానం దిగజారి 2020లో భారత్‌ 58వ ర్యాంక్‌తో సంతృప్తిపడాల్సి వచ్చింది. పశ్చిమాసియా దేశాలు, యూఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియాలు భారత్‌ కంటే ఎగువ ర్యాంకులు సాధించాయి. ఈ సర్వేలో మన పొరుగు దేశాలు చైనా, శ్రీలంకలు సైతం మహిళలకు అనువైన జీవనం కల్పించడంలో మనకంటే ముందున్నాయి.

Advertisement
Advertisement