Sakshi News home page

సర్వేలు అబద్ధాలు.. గెలుపు మాదే

Published Thu, Feb 5 2015 1:39 AM

సర్వేలు అబద్ధాలు.. గెలుపు మాదే - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మెజారిటీ వస్తుందన్న సర్వేలను ప్రధాని నరేంద్ర మోదీ కొట్టిపడేశారు. అవి అబద్ధాలని, ఢిల్లీ వాసులు వాటి ప్రభావానికి గురికావొద్దని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, పార్టీ అభ్యర్థి కిరణ్ బేడీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారమిక్కడి అంబేద్కర్‌నగర్‌లో తన చివరి ప్రచార సభలో ప్రసంగించారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. జన్‌ధన్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రస్తావిస్తూ జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.

'గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారు(ఆప్) తమకు 50 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ అతిపెద్ద పార్టీగా కూడా అవతరించలేకపోయారు. నేను వారణాసి లోక్‌సభ  సీటుకు పోటీ చేసినప్పుడు సర్వేలు 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతానన్నాయి. ఆ సర్వేల వాళ్లెవరో నాకు తెలియదు. లోక్‌సభ సీటులో గెలవలేని వ్యక్తి తనను గొప్పవాడిగా ప్రచారం చేసుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది' అని ఆప్ నేత కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, చంద్రబాబు నాయుడు వంటి రెండు మూడు సార్లు ముఖ్యమంత్రులు అయినవారు కూడా ప్రధానమంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేసుకోలేదని,  కానీ ఎన్నికల్లో గెలవలేని వారు మాత్రం ప్రధాని అభ్యర్థులుగా చెప్పుకుంటున్నారని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు.

నకిలీ కంపెనీల నుంచి ఆప్‌కు విరాళాలు వచ్చాయన్న ఆరోపణలనూ ప్రధాని ప్రస్తావించారు. 'ఆప్‌కు మీరూ విరాళాలు ఇచ్చారా అని నా స్నేహితులు నన్ను అడిగారు. మహాత్మాగాంధీ, ఒబామా(అమెరికా అధ్యక్షుడు) కూడా ఆప్‌కు విరాళాలిచ్చారని తెలుసుకుని ఆశ్చర్యపోయా. ప్రజా జీవితంలో ఇలాంటి అబద్ధాలకు తావులేదు' అని అన్నారు. తనది స్కాముల సర్కారు కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు.

నాది అభివృద్ధి మంత్రం..
అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి సాధించే రాజకీయాలు తనవని మోదీ పేర్కొన్నారు. ‘నాది అభివృద్ధి మంత్రం. పేదల జీవితాల్లో మార్పు రావాలి. గుడిసెల స్థానంలో కాంక్రీట్ ఇళ్లు రావాలి. మేం అధికారంలోకి వస్తే ప్రజా జీవితాన్ని సుఖమయం చేస్తాం. ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోం’ అని చెప్పారు. ఢిల్లీవాసులు భారీ ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని, సుస్థిర ప్రభుత్వం ఏర్పాడ్డానికి వీలుగా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఢిల్లీ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement