స్పీకర్ అనుమతితో సభలోకి రావచ్చు: వెంకయ్య | Sakshi
Sakshi News home page

స్పీకర్ అనుమతితో సభలోకి రావచ్చు: వెంకయ్య

Published Fri, Aug 7 2015 11:39 AM

స్పీకర్ అనుమతితో సభలోకి రావచ్చు: వెంకయ్య - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉభయసభల్లోనూ శుక్రవారం కూడా ప్రతిష్టంభన కొనసాగింది. విపక్షాల ఆందోళన, నినాదాలు యథావిధిగా కొనసాగాయి. సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు.  పసుపు రైతులకు కనీస మద్దతు ధర కావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత  ప్రస్తావించారు.  పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రైతులదే ప్రథమ స్థానమని తెలిపారు.  కనీస మద్దతు ధర లభించక తమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.  దీనికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు.   

ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే మరోసారి విపక్షసభ్యులు నినాదాలతో అడ్డుతగిలారు. నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.  స్పీకర్  సుమిత్రా మహాజన్ సభ సజావుగా సాగడానికి సభ్యులు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యుల  నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది.


సభ్యుల ఆందోళనపై  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. సభ సజావుగా సాగేందుకు సస్పెండైన సభ్యులు హామీ ఇస్తే, సస్పెన్షన్ ఎత్తివేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీనికి స్పీకర్ అనుమతి తీసుకొని సభలోకి  ప్రవేశించవచ్చని వెంకయ్య  ప్రకటించారు.  

అటు పార్లమెటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వరుసగా నాలుగో రోజూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన  కొనసాగింది.  కళంకిత మంత్రుల్ని తొలగించేదాకా ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.  మరోవైపు విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది.

Advertisement
Advertisement