పంజాబ్కు సుప్రీం షాక్.. హర్యానాకు పండగ | Sakshi
Sakshi News home page

పంజాబ్కు సుప్రీం షాక్.. హర్యానాకు పండగ

Published Thu, Nov 10 2016 5:11 PM

పంజాబ్కు సుప్రీం షాక్.. హర్యానాకు పండగ - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మరో జల వివాదం మొదలైంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య సట్లేజ్ యమునా లింక్(ఎస్వైఎల్) వివాదం మరోసారి రాజుకుంది. ఇతర రాష్ట్రాలతో నదీ జలాలు పంచుకునేందుకు నిరాకరించిన పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హర్యానా, ఇతర రాష్ట్రాలతో జలాలు పంచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం తీర్పునివ్వడంతో హర్యానాలో సంబరాలు వెలువడుతుండగా పంజాబ్లో ఆందోళన పర్వం మొదలైంది. అయితే, అది సామాన్యుల నుంచి కాకుండా రాజకీయ నాయకుల నుంచి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత లోక్ సభ ఎంపీ అమరీందర్ సింగ్ తన పదవి రాజీనామా చేశారు.

అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. 2004లో పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ టర్మినేషన్ ఆఫ్ అగ్రీమెంట్స్ యాక్ట్ 2004 చేసి హర్యానా వంటి రాష్ట్రాలకు సట్లేజ్ యమునా లింక్ జలాలను పంచుకునే ఒప్పందాన్ని విస్మరించింది. అప్పటి నుంచి కోర్టులో నలుగుతున్న ఈ వివాదంపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పంజాబ్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. హర్యానాతో నీటిని పంచుకోవాలని చెప్పింది. తాజా తీర్పుపై హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తర్ స్పందిస్తూ తీర్పు చాలా ఆలస్యంగా వచ్చిందని, అయినా హర్యానాకు అనుకూలంగా వచ్చినందున తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement