నందిని వివాహానికి అనుమతించండి | Sakshi
Sakshi News home page

నందిని వివాహానికి అనుమతించండి

Published Sun, Jun 30 2019 6:46 PM

Tamil Eluchi Peravai Request To Government Over Nandhini Marriage - Sakshi

సాక్షి, చెన్నై : మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ జైలు నిర్బంధంలో ఉన్న నందినిని వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. పదేళ్లుగా మద్యానికి వ్యతిరేకంగాను, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్‌ దుకాణాలను మూసివేయాలని కోరుతూ న్యాయవాది నందిని, ఆమె తండ్రి ఆనందన్‌ పోరాడుతున్న విషయం తెలిసిందే. 2016లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాలు పంచిపెట్టిన కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేసి, తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించి నందిని కోర్టును, న్యాయవాదులను విమర్శించే రీతిలో మాట్లాడడంతో వేరొక కేసును నమోదు చేశారు.

దీంతో జూలై 9వ తేదీ వరకు ఆమెను జైల్లో నిర్బంధించేందుకు శుక్రవారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 5న నందినికి వివాహం జరగాల్సి ఉండగా. ఇది వరకే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో తమిళ్‌ ఎళుచ్చి పేరవై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నందినిని ఆమె వివాహానికి అనుమతించాలని కోరింది. అలాగే, ఎస్‌డీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అహ్మద్‌నబి విడుదల చేసిన ప్రకటనలో మద్యనిషేధం కోసం పోరాడుతున్న నందినిని ఆమె తండ్రి ఆనందన్‌ను విడుదల చేయాలని కోరారు. నందినికి జూలై 5న వివాహం జరగనున్నందున వెంటనే ఆమెను విడదల చేయాలని కోరారు.

Advertisement
Advertisement