‘నేడు తెలంగాణకు పండగ రోజు’

21 Jun, 2019 13:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్ర‌పంచంలో అతిగొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వ‌రం చ‌రిత్ర సృష్టించిందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్ర‌పంచంలోనే గొప్ప ప్రాజెక్టులున్న అమెరికా, ఈజిప్ట్ స‌ర‌స‌న కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో భార‌త్ నిలిచిందని తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును జాతీయ అంకితం చేసిన సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సంబురాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాళేశ్వ‌రం ప్రాజెక్టును కేసీఆర్ ప్రాజెక్టుగా తాము భావిస్తున్నామని, రీడిజైన్‌తో దీన్ని ప్ర‌పంచ స్థాయిలో నిలిపిన ఘ‌న‌త ఆయనదేనని కొనియాడారు. తెలంగాణకు, దేశానికి నేడు పండగ రోజని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీరతాయన్నారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ గురించి ప్ర‌స్తావిస్తే బాగుండేదని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో పూర్తికావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకితీసుకెళ్ళడం మామూలు విషయం కాదన్నారు. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావడం సంతోషకరమన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఫ‌లాలు రాష్ట్రంలోని గ్రామ‌ గ్రామానికి అంద‌నున్నాయని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పార్ల‌మెంట్ స‌మావేశాల కార‌ణంగా కాళేశ్వ‌రం ప్రారంభోత్స‌వాల్లో పాల్గొన‌లేక‌పోయామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు