‘తెలుగు’ రైళ్లు కావాలి.. | Sakshi
Sakshi News home page

‘తెలుగు’ రైళ్లు కావాలి..

Published Sat, Jul 5 2014 11:52 PM

‘తెలుగు’ రైళ్లు కావాలి.. - Sakshi

మహారాష్ట్ర నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు తగిన సేవలను అందించలేకపోతున్నాయి. పెరుగుతున్న తెలుగు జనాభాకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగకపోవడమే దీనికి కారణం.. ముంబై నుంచే కాక వివిధ నగరాలనుంచి తెలుగు ప్రజల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాలకు రైళ్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినబడుతోంది. ఈసారి బడ్జెట్‌లో తెలుగు ప్రజలకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే..
 
 సాక్షి, ముంబై: ఎన్‌డీఏ సర్కార్ ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఈ నెల 8వ తేదీన ప్రవేశపెట్టనున్న 2014-15 రైల్వే బడ్జెట్‌పై ముంబైలోని తెలుగు ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. తెలుగునేల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం కేంద్రం ప్రవేశపెడుతున్న తొలి రైల్వేబడ్జెట్ కావడంతో ఈసారి బడ్జెట్‌లో తమకు ప్రాధాన్యం చేకూరుతుందన్న నమ్మకంతో రెండు ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు స్థిరపడిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల వాసులే కాక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, కృష్ణా వంటి జిల్లాల ప్రజలు అధికంగా ఉన్నారు.
 
నిజామాబాద్‌కు మరో రైలు వేయాలి...
నిజామాబాద్‌కు ప్రత్యేక రైలు వేయాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ముంబై నుంచి నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఉంది. దీంతోపాటు గత ఏడాది అక్టోబర్‌లో వారానికి ఒకసారి నడిచే లోకమాన్యతిలక్ టర్మినస్ (ఎల్‌టిటి-కుర్లా)-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అయితే ఈ రైలు ఎల్‌టిటి-కుర్లా నుంచి బయలుదేరడం, ఠాణేలో స్టాప్ లేకపోవడంతో తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని చెబుతున్నారు.

అదేవిధంగా కేవలం వారానికి ఒకసారి నడపడంతో పెద్దగా సౌకర్యవంతంగా లేదన్న వాదన విన్పిస్తోంది. దీంతోపాటు నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పొడిగిస్తున్న కొత్త రైల్వే మార్గం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్-ఆర్మూర్‌ల మధ్య ట్రాక్ పనులు పూర్తి కావాల్సి ఉంది. అవి పూర్తయినట్టయితే ముంబై నుంచి నేరుగా నిజామాబాద్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ వరకు రైలు సేవలు ప్రారంభించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.  
 
ఠాణేలో స్టాప్ ఇవ్వాలి...

హైదరాబాద్, విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు ఠాణేలో స్టాప్ ఇవ్వాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు నివసిస్తున్నారు. వీరందరూ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు విశాఖపట్నం తదితర ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అయితే ఠాణేలో మాత్రం వీటికి స్టాప్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ఠాణేలో ఈ రైళ్లను నిలుపడంతోపాటు మరో రైలును ప్రారంభించాలని వీరు కోరుకుంటున్నారు.
 
పుణే-హైదరాబాద్‌ల మధ్య మరో రైలు నడపాలి...
పుణేలో నివసించే తెలుగు ప్రజలను దృష్టిలో ఉంచుకుని పుణే నుంచి హైదరాబాద్‌కు మరో రైలును నడపాలని స్థానిక తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పుణేలో తెలుగువారి సంఖ్య భారీగానే ఉంది. దీంతో పుణే నుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజూ వేల సంఖ్యలో బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం పుణే నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఉదయం ఒక రైలు ఉండగా వయా లాతూరు మరో రైలు ఉంది. వీటితోపాటు సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్ రైలును ఇటీవలే ప్రారంభించారు.
 
అదే విధంగా ముంబైతోపాటు రాజ్‌కోట్ మొదలగు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లు కూడా పుణే మీదుగా వెళ్తాయి. అయితే  రాయిచూర్, గద్వాల్‌ల మీదుగా గుంటూర్, విజయవాడలకు వెళ్లేలా ఒక రైలు వేస్తే సౌక ర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
 
షోలాపూర్-హైదరాబాద్‌ల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలి...

షోలాపూర్-హైదరాబాద్‌ల మధ్య కొత్తగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని స్థానిక తెలుగు ప్రజలు కోరుతున్నారు.  షోలాపూర్‌లో సుమారు ఆరు లక్షల మందికిపైగా తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికీ హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాలతో సంబంధాలున్నాయి. వీరంతా తరుచూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. బస్సు చార్జీలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రైలు సేవలు మరింత పెంచాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా భివండీలో స్థిరపడిన లక్షలాదిమంది తెలుగు ప్రజల సౌకర్యార్థం  రాజ్‌కోట్-సికింద్రాబాద్ రైలులో అదనంగా ఓ బోగీని కేటాయించాలని స్థానిక తెలుగు ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement