నవరాత్రి వేడుకల్లో విషాదం: 115 మంది మృతి | Sakshi
Sakshi News home page

నవరాత్రి వేడుకల్లో విషాదం: 115 మంది మృతి

Published Mon, Oct 14 2013 1:10 AM

Temple stampede in Madhya Pradesh kills 115

దాతియా: మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో దసరా నవరాత్రి వేడుకల వేళ విషాదం చోటు చేసుకుంది. రతన్‌గఢ్‌లోని దుర్గాదేవి ఆలయం వద్ద సింధు నదిపై ఉన్న వంతెనపై ఆదివారం ఉదయం సుమారు 8.30 గంటలకు జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 30 మంది చిన్నారులు ఉన్నారు. వంతెన కూలిపోనుందనే వదంతి ప్రచారం కావడంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆలయం వద్ద క్యూలో భక్తులు నిలుచుని ఉండగా, కొందరు క్యూ దాటుకుని దూసుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు.

ఈ గందరగోళంలో వంతెన రెయిలింగ్ విరిగింది. ట్రాక్టరు ఢీకొనడంతో రెయిలింగ్ విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈలోగా వంతెన కూలిపోతోందంటూ వదంతి ప్రచారం కావడంతో జనం కకావికలమై పరుగులు తీశారు. కొందరు వంతెన పైనుంచి నదిలోకి దూకేశారు. దాతియా జిల్లాతో పాటు పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ప్రాణనష్టం తీవ్రస్థాయిలో సంభవించినట్లు తెలుస్తోంది.
 
 వదంతి కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఎంపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేసీ డే చెప్పారు. అయితే, ట్రాక్టరు ఢీకొనడంతో వంతెన రెయిలింగ్ దెబ్బతిన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ధ్రువీకరించలేదు. సంఘటన జరిగిన సమయంలో ఆలయం వద్ద దాదాపు 25 వేల మంది భక్తులు ఉన్నారు. ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో నదిపై ఉన్న వంతెనను నాలుగేళ్ల కిందటే నిర్మించారు. కేవలం ఏడు మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెనపై జనం కిక్కిరిసి పరుగులు తీసేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
 
 తొక్కిసలాట తర్వాత సహాయక కార్యక్రమాల్లో జాప్యం చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన జనం పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో డీఎస్పీ బీఎన్ బసవే సహా కొందరు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల లాఠీచార్జి కారణంగానే తొక్కిసలాట జరిగిందనే వార్తలను చంబల్ రేంజ్ డీఐజీ దిలీప్ ఆర్య తోసిపుచ్చారు. నదిలోకి దూకేయడంతో కొందరు మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. తొక్కిసలాట కారణంగానే మరణాలు సంభవించాయని చెప్పారు.
 
 వదంతుల కారణంగానే తొక్కిసలాట జరిగిందని, వదంతులను ప్రచారం చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే, ప్రస్తుతం సహాయక చర్యలకు తొలి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. తొక్కిసలాట తర్వాత ఆలయం వద్ద, వంతెనపైన బీభత్స పరిస్థితులు కనిపించాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్లో తమ వారిని వెదుక్కుంటున్న బంధువుల రోదనలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆలయ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఆలయం నుంచి బయటకు వెళ్లే ఏకైక రోడ్డుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక కార్యక్రమాలు కష్టతరంగా మారాయి. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి రావడంతో మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించగలిగారు. సహాయక కార్యక్రమాల్లో మూడు కంపెనీల బలగాలు పాల్గొంటున్నట్లు శాంతిభద్రతల విభాగం ఐజీ డి.శ్రీనివాసరావు చెప్పారు. మరోవైపు, పరిస్థితిని సమీక్షించేందుకు డీజీపీ నందన్ దూబే, ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రాలు భోపాల్ నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. త్వరలోనే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పరిహారం ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల చొప్పున పరిహారం ప్రకటించింది.
 
 ప్రధాని, రాష్ట్రపతి, సోనియా సంతాపం...
 
 తొక్కిసలాట సంఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సత్వర సహాయం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్రపతి అధికారులకు సూచించారు. మధ్యప్రదేశ్ సీఎల్పీ నేత జరిగిన విషాదంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. యంత్రాంగం తీరును ఆయన తప్పుపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేయడం వల్లనే తొక్కిసలాట జరిగి నిండు ప్రాణాలు బలైపోయాయని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీలు ఎన్నికల విధుల్లో తలమునకలై ఆలయం వద్ద శాంతిభద్రతల పరిస్థితిని గాలికొదిలేశారని బీఎస్పీ నేత రాజేంద్ర భారతి ఆరోపించారు. లోగడ 2006లోనూ ఇదే వంతెనపై తొక్కిసలాట జరిగినా, ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాన్నీ నేర్చుకోలేదని దుయ్యబట్టారు.
 
 గడచిన దశాబ్దంలో జరిగిన భారీ తొక్కిసలాటలు...
 
 2013 ఫిబ్రవరి 11: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమవుతున్న 37 మంది భక్తులు మృతి చెందారు.
 2012 నవంబర్ 19: బీహార్ రాజధాని పాట్నాలో గంగానది ఒడ్డున ఛత్ పూజ వేడుకల సమయంలో వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు.
 2011 జనవరి 14: కేరళలోని అయ్యప్ప క్షేత్రమైన శబరిమలైలో మకరజ్యోతి సందర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మృతి చెందారు.
 2010 మార్చి 4: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.
 2008 సెప్టెంబర్ 30: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ చాముండా దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 224 మంది భక్తులు మరణించారు.
 2005 జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లా మంధర్ దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 304 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
 2003 ఆగస్టు 27: మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది యాత్రికులు మరణించారు.
 

Advertisement
Advertisement